- స్ట్రాంగ్ రూంకి ఈవీఎంలు తరలించిన అధికారులు...
- కౌంటింగ్‌కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు...
- స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 144 సెక్షన్ మూడంచెల భద్రత
- పోలీస్ అధికారులతో సమీక్ష చేసిన సీపీ విష్ణు వారియర్
ఖమ్మం రూరల్, వెలుగు : ఖమ్మం జిల్లాలో గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లావ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో చిన్న చిన్న సంఘటనలు మినహా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. జిల్లావ్యాప్తంగా 83.83 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సాంకేతిక సమస్యలతో రాత్రి వరకు పోలింగ్ కొనసాగింది.
కౌంటింగ్‌కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు...
ఖమ్మం రూరల్ మండలంలోని పొన్నెకల్లు శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు శుక్రవారం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ తెలిపారు. ఆదివారం ఓట్ల లెక్కింపు ఉండగా శుక్రవారం పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ విష్ణువారియర్ సమీక్ష చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ వద్ద 144 సెక్షన్ విధించి, మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మొదటి స్థాయిలో కేంద్ర బలగాలు, రెండో స్థాయిలో సాయుధ సిబ్బంది, మూడో స్థాయిలో సివిల్ పోలీసులు ఉంటారని అయన తెలిపారు. అగ్నిమాపక పరికరాలను సైతం అధికారులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఆడిషనల్ డీసీపీ, ఏసీపీలు పర్యవేక్షణలో పోలీసులు, ఆర్మ్ డ్ రిజర్వ్, కేంద్ర బలగాలు స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పహారా కాస్తున్నాయని తెలిపారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులకు సీపీ సూచించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు, ఏసీపీలు హరికృష్ణ, రూరల్ ఏసీపీ భాస్వరెడ్డి, ప్రసన్న కుమార్, రహెమాన్, రామనుజం, రవికుమార్, సాంబరాజు, నర్సయ్య పాల్గొన్నారు.