- జూన్ క్వార్టర్‌లో 13 శాతం పెరిగిన ఇండ్ల రేట్లు
- ఎక్కువగా కోల్‌కతాలో 15% అప్
- అమ్ముడుకాని ఇండ్లు పెరిగినా, రేట్లు పైకే
హైదరాబాద్, వెలుగు: దేశంలోని టాప్ సిటీలలో ఇండ్ల రేట్లు మరింత పెరిగాయి. హైదరాబాద్‌లో కిందటేడాది జూన్ క్వార్టర్‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్ క్వార్టర్ (క్యూ1) లో ఇండ్ల ధరలు 13 శాతం ఎగశాయి. చదరపు అడుగు సగటు ధర రూ. 10,530 కి చేరుకుంది. క్రెడాయ్, కొలియర్స్, లియాసెస్ ఫోరస్ జాయింట్‌గా విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో కోల్‌కతాలో ఇండ్ల ధరలు ఎక్కువగా, అంటే ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం 15 శాతం పెరిగాయి.
ఎన్‌సీఆర్‌లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ రేట్లు 14 శాతం గ్రోత్‌ను నమోదు చేశాయి. ముంబైలో మాత్రం ఇండ్ల ధరలు 3 శాతం తగ్గాయి. ఇండ్లు కొనడానికి జనాలు ఆసక్తి చూపిస్తుండడం, వడ్డీ రేట్లు నిలకడగా ఉండడం, ప్రజల ఆదాయాలు మెరుగుపడడంతో హౌసింగ్ డిమాండ్ నిలకడగా పెరుగుతోందని పైన పేర్కొన్న రిపోర్ట్ వెల్లడించింది. కేవలం సేల్స్ మాత్రమే కాకుండా మార్కెట్‌లోకి వస్తున్న కొత్త లాంచ్‌లు కూడా గత కొన్ని క్వార్టర్లుగా పెరిగాయని వివరించింది.
ఫలితంగా అమ్ముడుకాకుండా మిగిలిపోతున్న ఇండ్లు కూడా పెరిగాయని, దేశం మొత్తం మీద ఇలాంటి ఇండ్లు 13 శాతం (ఇయర్ ఆన్ ఇయర్– వైఓవై) పెరిగాయని క్రెడాయ్, కొలియర్స్, లియాసెస్ ఫోరస్ రిపోర్ట్ పేర్కొంది. ఈ రిపోర్ట్ ప్రకారం, పెద్ద ఇండ్లకు డిమాండ్ పెరుగుతోంది. డెవలపర్లు హై ఎండ్ ప్రాజెక్ట్‌లను లాంచ్ చేస్తున్నారు. ఫలితంగా హైదరాబాద్, కోల్‌కతా, ఢిల్లీ–ఎన్‌సీఆర్, బెంగళూరు మార్కెట్లలో ఇండ్ల ధరలు పెరుగుతున్నాయి.
దేశం మొత్తం మీద జరుగుతున్న సేల్స్ చూస్తుంటే ప్రజలు ఇండ్లు కొనడానికి వెనకడగు వేయడం లేదని తెలుస్తోందని క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ బోమన్ ఇరాని అన్నారు. పెంటప్ డిమాండ్ వలన కరోనా తర్వాత ఇండ్లు భారీగా అమ్ముడవుతున్నాయని, రేట్లు పెరిగినా హోమ్ బయ్యర్లు పట్టించుకోవడం లేదని చెప్పారు. వడ్డీ రేట్లు నిలకడగా ఉండడంతో పాటు ఫెస్టివ్ సీజన్ స్టార్ట్ కానుండడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇదే మూమెంటం కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
‘గత 10 క్వార్టర్ల నుంచి ఇండ్ల రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రెపో రేటు 6.5 శాతం దగ్గర స్టేబుల్‌గా ఉంది. ఫలితంగా హోమ్‌బయ్యర్లు చెల్లించే ఈఎంఐలు నిలకడగా ఉన్నాయి. కన్‌స్ట్రక్షన్ ఖర్చులు పెరగడంతో డెవలపర్లు ఇబ్బంది పడుతున్నా, హౌసింగ్ డిమాండ్ మాత్రం తగ్గడం లేదు’ అని కొలియర్స్ ఇండియా ఎండీ పీయూష్ జన్ అన్నారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ మెరుగుపడడం, ప్రజల ఆదాయాలు, ప్రభుత్వం ఇస్తున్న ఇన్సెంటివ్స్ పెరగడంతో దేశంలోని టాప్ 8 సిటీలలో హౌసింగ్ డిమాండ్ పెరుగుతోందని చెప్పారు.
కొత్త ప్రాజెక్ట్‌లతో రేట్లు 40 % అప్
హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్‌సీఆర్, కోల్‌కతా, ముంబై (ఎంఎంఆర్), పూణె సిటీలను గమనిస్తే ఇండ్ల ధరలు ఎక్కువగా కోల్‌కతాలో పెరిగాయి. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన క్వార్టర్‌లో ఈ సిటీలో చదరపు అడుగు సగటు ధర రూ.7,315 గా రికార్డయ్యింది. ఇండ్ల ధరలు క్యూ1 లో కిందటేడాది జూన్ క్వార్టర్‌తో పోలిస్తే 15 శాతం పెరిగాయి. ఇక్కడి ప్రభుత్వం స్టాంప్‌డ్యూటీని 2 శాతం తగ్గించిన విషయం తెలిసిందే. సర్కిల్ రేట్లను ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 10 శాతం తగ్గించింది.
ఫలితంగా ఇండ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో అయితే గోల్ఫ్ కోర్స్ రోడ్, ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే చుట్టుపక్కల ఇండ్ల ధరలు క్యూ1 లో ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం 40 శాతానికి పైగా పెరిగాయి. బెంగళూరులో క్యూ1 లో ఇండ్ల ధరలు ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం 10 శాతం పెరిగాయి. 3 బీహెచ్‌కే రేట్లు 12 శాతం మేర పెరిగాయి. మరోవైపు హైదరాబాద్, అహ్మదాబాద్ సిటీలలో అమ్ముడుకాని ఇండ్లు సగటున 25 శాతం పెరిగాయి. అయినప్పటికీ ఈ సిటీలలో ఇండ్ల ధరలు నిలకడగా పెరుగుతున్నాయని క్రెడాయ్, కొలియర్స్ రిపోర్ట్ వివరించింది.