Vadhuvu Web Series Review: సస్పెన్స్తో థ్రిల్ చేసే కుటుంబకథా చిత్రం

Vadhuvu Web Series Review: సస్పెన్స్తో థ్రిల్ చేసే కుటుంబకథా చిత్రం

ప్రస్తుతం ఆడియన్స్ సినిమాల కన్నా ఎక్కువగా వెబ్ సిరీస్ పై మక్కువ చూపిస్తున్నారు. నిడివి ఎక్కువైనా సరే కంటెంట్ బాగుంటే.. సమయమా కేటాయించి మరీ చూస్తున్నారు. అందుకే కొత్త కొత్త వెబ్ సిరీస్ లను ప్రేక్షకులకు అందిస్తున్నాయి ఓటీటీ సంస్థలు. అలా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొత్త వెబ్ కంటెంట్ వధువు. బెంగాలీ భాషలో వచ్చిన ఇందు వెబ్ సిరీస్‌ కు రీమేక్ గా వచ్చిన ఈ సిరీస్ లో..  అవికా గోర్‌ (Avika Gor), నందు (Nandu), అలీ రెజా (Ali Reza) ప్రధాన పాత్రల్లో నటించారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ (Vadhuvu on Disney+ Hotstar) లో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సిరీస్. మరి వధువు ఎలా ఉంది? ప్రేక్షకులను ఏమేరకు మెప్పించింది? అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
అంజూరి ఇందు (అవికా గోర్‌) చాలా పద్దతైన, తెలివైన అమ్మాయి. చదువులోనూ దిట్ట. తనకు ఒక చెల్లి. ప్రేమ వ్యవహారాలు కాకుండా..  తల్లితండ్రులు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తుంది కానీ.. మరికొన్ని నిమిషాల్లో పెళ్లి ముహూర్తం ఉండగా ఇందుకు కాబోయే వరుడితో తన చెల్లి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటుంది. దాంతో ఇందు పడుతన్న బాధను చూడలేక.. ఆమెకు పెళ్లి చేయాలని చూస్తారు ఆమె పేరెంట్స్. అలా ఆనంద్‌ (నందు)తో ఇందు వివాహం జరుగుతుంది. అత్తారింటిలో పరిస్థితులు చాలా వింతగా అనిపిస్తాయి ఇందుకు. మరిది ఆర్య (అలీ రెజా) అప్పటికే పెళ్లవుతుంది కానీ బయటకు తెలియనివ్వరు ఎందుకు? వైష్ణవి ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయింది? ఆడపడుచుపై హత్యాయత్నం ఎందుకు జరిగింది? అనే విషయాలు తెలియాలంటే వెబ్ సిరీస్ చూడాల్సిందే.

విశ్లేషణ:
అనుమానం అనేది పెనుభూతం అని మన పెద్దలు ఊరుకే చెప్పలేదు. అది ఒకసారి ఒకరిపై కలిగిందంటే.. చచ్చే వరకు అలాగే ఉంటుంది. దాదాపు ఇదే కాన్సెప్ట్ తో వచ్చింది వధువు వెబ్ సిరీస్. పెళ్లి, పెళ్ళికొడుకుతో పెళ్లికూతురు చెల్లి లేచిపోవడం.. ఇలా చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో వధువు సిరీస్ మొదలవుతుంది. దాదాపు చివరివరకు కూడా ఆ ఇంట్రెస్ట్ ను మైంటైన్ చేశారు. ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో ట్విస్ట్ ఇస్తూ.. ఆతరువాత ఏం జరుగుతుందనే ఆతురత ఆడియన్స్ లో కలుగుతుంది. 

అయితే.. 7 ఎపిసోడ్స్ గా వచ్చిన ఈ సిరీస్ మొదటి నాలుగు ఎపిసోడ్స్ ఒక ఎత్తైతే.. మిగిలిన మూడు ఎపిసోడ్స్ ఒక ఎత్తని చెప్పాలి. ముందు ఎపిసోడ్స్ లో చూపించిన ట్విస్టులను రివీల్ చేసిన విధానం చాలా బాగుంది. ఒక్కో ఎలిమెంట్ క్లియర్ అవుతున్న ప్రతీసారి ఆడియన్స్ థ్రిల్ అవుతారు. ఇందు, ఆనంద్, ఆర్య, వైష్ణవి.. ఈ పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు ఉత్కంఠగా సాగుతాయి. కానీ వాటికి సరైన జెస్టిఫికేషన్ ఇవ్వకుండా.. వధువు సీక్వెల్ కోసం వెయిట్ చేయమనడం ఆడియన్స్ కు కాస్త డిజప్పాయింట్ ను కలిగిస్తుంది. 

నటీనటులు:
వధువు సిరీస్ లో అందరికన్నా ముందు చెప్పుకోవాల్సింది అవికా గోర్‌ గురించి. ఇందు పాత్రలో ఆడియన్స్ ను కట్టిపడేస్తుంది. ఎలాంటి సమస్యలు ఎదురైనా.. కుంగిపోకుండా పోరాడి గెలిచే అమ్మాయిగా ఆకట్టుకుంటుంది. ఇక ఆనంద్‌ పాత్రకు నందు కూడా న్యాయం చేశారు. ఆలీ రెజా కూడా తన పాత్రలో ఒదిగిపోయారు. ఈ సిరీస్ తరువాత ఆలీ రెజాకు అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇక మిగిలినవారు కూడా తమ తమ పాత్రల మెర్ బాగానే నటించారు. 

సాంకేతిక వర్గం:
వధువు లాంటి ఫ్యామిలీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు సంగీతం చాలా ముఖ్యం. అందులో శ్రీరామ్‌ మద్దూరి సూపర్ సక్సెస్ అయ్యారు. ఈ సినిమాకు ఆయన అందించిన నేపథ్య సంగీతం మెయిన్ హైలెట్ గా నిలిచింది. ఇక రామ్‌ కె. మహేశ్‌ కెమెరా పనితీరు, ఎడిటర్ అనిల్‌ కుమార్‌ కు మంచి మార్కులు పడ్డాయి. 

ఇక వధువు వెబ్ సిరీస్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే.. సస్పెన్స్ తో థ్రిల్ పెంచే కుటుంబకథా చిత్రం