ILT20: 27 బంతుల్లోనే 81 పరుగులు.. రైనా ఇన్నింగ్స్ గుర్తు చేసిన శ్రీలంక క్రికెటర్

శ్రీలంక బ్యాటర్ అవిష్క ఫెర్నాండో సంచలన ఇన్నింగ్స్ తో మెరిశాడు. ఇంటర్నేషనల్ టీ20 లీగ్ లో సునామీ ఇన్నింగ్స్ తో హోరెత్తించాడు. షార్జా వారియర్జ్ తరపున ఆడుతున్న ఫెర్నాండో.. శుక్రవారం (జనవరి 17) దుబాయ్ క్యాపిటల్స్‌పై 27 బంతుల్లోనే 81 పరుగులు చేసి జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. అతని ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు.. 8 సిక్సర్లు ఉన్నాయి. ఈ లంక ఆటగాడి విధ్వంసంతో 202 పరుగుల లక్ష్యాన్ని షార్జా మరో 11 బంతులు మిగిలి ఉండగానే ఛేజ్ చేసింది. 

కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఫెర్నాండో  ఇన్నింగ్స్ ఐపీఎల్ లో సురేష్ రైనా ఇన్నింగ్స్ ను గుర్తు చేసింది. 2014 కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై  ఛేజింగ్ లో క్వాలిఫైయర్ మ్యాచ్ లో రైనా 25 బంతుల్లో 87 పరుగులు చేసి చెన్నై సూపర్ కింగ్స్ కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. ఛేజింగ్ లో  ఫెర్నాండో ఇన్నింగ్స్ కూడా అదే తరహాలో సాగింది. ఛేజింగ్ లో రైనా ఆడిన ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ గా నిలిచింది. 

ALSO READ | Ranji Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు గాయాల బెడద.. రంజీ ట్రోఫీ నుంచి కోహ్లీ, రాహుల్‌ ఔట్

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. హోప్ 52 బంతుల్లోనే 83 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. రోవ్ మెన్ పావెల్ 15 బంతుల్లోనే 28 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 202 పరుగుల లక్ష్య ఛేదనలో షార్జా వారియర్జ్ అవిష్క ఫెర్నాండో (81) విధ్వంసంతో 18.2 ఓవర్లలో ఛేజ్ చేసి గెలిచింది.