ఏవీఎన్ రెడ్డి గెలుపు మలుపు కానుంది : పిన్నింటి బాలాజీ రావు

ఏవీఎన్ రెడ్డి గెలుపు మలుపు కానుంది : పిన్నింటి బాలాజీ రావు

మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏవీఎన్ రెడ్డి గెలుపు సామాన్య ఉపాధ్యాయుల ఆశలు, ఆకాంక్షలకు ప్రతీకగా చూడవచ్చు. బీజేపీ, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం బలపర్చిన ఆయన మొదటి నుంచి చివరి రౌండ్ వరకు ఎప్పుడూ లీడ్ లోనే కొనసాగారు. ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఏవీఎన్​రెడ్డి సాధించిన అపూర్వ విజయం ఇది. ఎన్నో సమస్యలపై తాత్సార వైఖరికి నిరసనగా ఉపాధ్యాయులంతా సంధించిన బ్రహ్మాస్త్రంగా ఈ గెలుపును భావించాలి.

ఈ గెలుపు మార్పుకు నాంది పలకబోతున్నది. రాబోయే రోజుల్లో తెలంగాణలో టీచర్ల సమస్యలపై ఆయన చట్టసభలో గొంతెత్తనున్నారని చాలా మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సాదాసీదాగా బయటకు కనిపించే ఈ ఎన్నిక రాబోయే తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పే అవకాశం ఉన్నది. దాదాపు 50 శాతం జనాభా ఉన్న ప్రాంతంలో పరిపక్వత గల ఉపాధ్యాయులు ఓటు వేసిన ఈ ఎన్నికను అత్యంత శాస్త్రీయమైన ఒక సమగ్ర ఎన్నికల సర్వే గానే భావించాల్సి ఉంటుంది.

ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యల పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి, పాఠశాలలు, విద్యార్థులు, సమాజం, ఉద్యోగుల పట్ల చూపిస్తున్న నిరంకుశ వైఖరికి చెంపపెట్టులాంటిది ఈ విజయం. సమాజ నిర్మాతలే ఉపాధ్యాయులు అని మరోసారి నిరూపించారు. ఈ విజయం విద్యారంగ పరిరక్షణకు ఉపాధ్యాయుల,ఉద్యోగుల హక్కులకు బాసటగా నిలుస్తుంది. ఇంతకాలం తమ తరఫున చట్టసభలో మాట్లాడే వారు లేరని నిరాశ చెందిన ఉపాధ్యాయులకు కొంత ఉపశమనం దొరికే అవకాశం ఉంది.

-పిన్నింటి బాలాజీ రావు, వరంగల్​