వాయిదాల పేరుతో తప్పించుకుంటున్నరు

వాయిదాల పేరుతో తప్పించుకుంటున్నరు
  • ఏక కాల రుణమాఫీ ఎందుకు చెయ్యలే?: కిషన్ రెడ్డి

హైదరాబాద్/న్యూఢిల్లీ, వెలుగు: డిసెంబర్ 9న సోనియా గాంధీ బర్త్ డే సందర్భంగా రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నా ఎందుకు చేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం వాయిదాల పేరుతో కాలయాపన చేస్తున్నదని మండిపడ్డారు. బుధవారం పార్టీ స్టేట్ ఆఫీస్​లో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ‘రైతు సహాయ కేంద్రం’ పోస్టర్​ను ఆయన రిలీజ్ చేశారు. 

తర్వాత హెల్ప్ లైన్ నంబర్ 8886 100 097ను ప్రారంభించారు. రుణమాఫీ అందని రైతుల వివరాలు సేకరించి, వారికి సహాయం అందించేలా కార్యాచరణ చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. ‘‘గత అసెంబ్లీ ఎన్నికల టైమ్​లో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ లీడర్లు రైతుల వద్దకు వెళ్లి, అధికారంలోకి వస్తే రూ.2 లక్షల వరకు రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.

 రైతు డిక్లరేషన్ పేరుతో అనేక హామీలు ఇచ్చారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీ, ఎకరానికి రూ.15వేల పెట్టుబడి సాయం, కౌలు రైతులకు రూ.15వేల ఆర్థిక సాయం ఇంకా అమలు చేయలేదు’’అని అన్నారు. రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరించి, గ్రామాల్లో రచ్చబండ ద్వారా సమస్యలు తెలుసుకుంటామన్నారు. వారందరికీ న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు.

సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు

సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచనేది కేంద్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలి పారు. బుధవారం లోక్ సభలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.