హైదరాబాద్, వెలుగు: సిటీలో నిర్వహించిన 7వ గార్డెన్ ఫెస్టివల్, మొదటి అర్బన్ ఫార్మింగ్ ఫెస్టివల్–-2023లో జీహెచ్ఎంసీకి 19 అవార్డులు వచ్చినట్లు గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ఈ అవార్డులు వచ్చేందుకు సిటిజన్లు, అధికారులు సహకరించినందుకు అభినందనలు తెలిపారు. ఇలాంటి ఫెస్టివల్స్‌ను జీహెచ్ఎంసీ పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 7వ గార్డెన్ ఫెస్టివల్‌ను ఈ నెల 15న నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో నిర్వహించారని, ఈ ఫెస్టివల్లో జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ గార్డెన్ నిర్వహణలో ఎల్ బీనగర్ జోన్‌కు 14, కూకట్పల్లి జోన్‌కు 3, ఖైరతాబాద్ జోన్‌కు రెండు అవార్డులు దక్కాయని తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ సంబంధిత మేనేజర్లకు ఫస్ట్ ప్రైజ్ గోల్డెన్ గార్డెన్ అవార్డు, సెకండ్ ప్రైజ్ సిల్వర్ గార్డెన్ అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో యూబీడీ అడిషనల్ కమిషనర్ కృష్ణ, ఖైరతాబాద్ జోన్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఎల్ బీ నగర్ జోన్ డిప్యూటీ డైరెక్టర్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
11 అంశాలకు స్టాండింగ్ కమిటీ ఆమోదం
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బల్దియా హెడ్డాఫీసులో బుధవారం జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. మన్సూరాబాద్ సహారా కాంపౌండ్ వాల్ కల్వర్టు నుంచి జీఎస్ఐ రోడ్ కల్వర్ట్ డబుల్ బెడ్రూం అపార్ట్ మెంట్ వరకు రూ.6 కోట్ల అంచనాతో స్ట్రోమ్ వాటర్ బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి టెండర్లకు ఆహ్వానం, జీడిమెట్ల, పేట్ బషీర్‌బాద్‌లో ఏర్పాటు చసిన దండముడి ఎన్ క్లేవ్ లో అంతర్గత రోడ్ల విస్తరణ, నల్లగండ్లలోని హుడా లేవౌట్ లో 40 ఫీట్ల రోడ్డు, లాల్ సాబ్ గూడలోని రామన్న చెరువు, గచ్చిబౌలిలోని పికాక్ లేక్ మురుగు మళ్లింపు లేన్ నిర్మాణం కోసం షార్ట్ టెండర్లకు అనుమతులతో పాటు మరో 7 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. సమావేశంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్, వనం సంగీత యాదవ్, పండల సతీష్ బాబు, మహేశ్వరి, కమిషనర్ డీఎస్ లోకేశ్ కుమార్, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, అడిషనల్ కమిషనర్ ప్రియాంక ఆలా తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.