ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే చాలు క్షణాల్లో తెలిసిపోతుంది. రోజూ ఏదో ఒక పనికి సెర్చ్ ఇంజిన్లను వాడుతుంటాం. అయితే సెర్చ్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే సైబర్ దొంగల వలలో చిక్కుకునే అవకాశం ఉంది. సైబర్ ఎటాక్స్ నుంచి తప్పించుకునేందుకు కొన్ని టిప్స్ పాటిస్తూ అలర్ట్‌గా ఉండాలి.
ఏదైనా సెర్చ్ చేసినప్పుడు ‘స్పాన్సర్డ్’ పేరుతో కొన్ని వెబ్ పేజీలు కనిపిస్తాయి. అఫీషియల్ వెబ్సైట్లతోపాటు స్కామర్లు కూడా వీటిని కొనే ఛాన్స్ ఉంది. కాబట్టి వాళ్ల వెబ్ పేజ్‌లు కూడా టాప్‌లో కనిపిస్తాయి. స్కామర్లు క్రియేట్ చేసిన వెబ్ పేజ్‌లు మాల్వేర్తో ఉంటాయి. కాబట్టి ఆ వెబ్ పేజ్ వాడితే, పర్సనల్ డాటా మొత్తం వాళ్లకు వెళ్లిపోతుంది. ఈజీగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఆన్లైన్లో వెతుకుతుంటారు కొందరు.
అలాంటి వాళ్లను టార్గెట్ చేసి ఎక్కువ మొత్తంలో బోనస్‌లు, సంపాదన ఉంటుందని ఊరిస్తారు. వాటిని నమ్మి అవి క్లిక్ చేస్తే... మోసపోతారు. అలాగే కొన్నిసార్లు సెర్చ్ ఇంజిన్‌లో కస్టమర్ కేర్ నెంబర్ కోసం వెతికినప్పుడు... కొన్ని ఫేక్ ఫోన్ నెంబర్స్ కూడా కనిపిస్తాయి. కాబట్టి ఏ కంపెనీ నెంబర్ కావాలన్నా వాళ్ల అఫీషియల్ సైట్‌కి వెళ్లి తెలుసుకోవాలి. ఇదే కాకుండా సిబిల్ స్కోర్, సిబిల్ రిపోర్ట్ తెలుసుకోవాలంటే మరింత జాగ్రత్త అవసరం. వాటిని తెలుసుకోవడానికి చాలా ఫేక్ వెబ్‌సైట్స్ కనిపిస్తాయి. వాటిని వాడకూడదు. ఆర్బీఐ అనుమతించిన క్రెడిట్ బ్యూరోల ద్వారా మాత్రమే క్రెడిట్ స్కోర్ తెలుసుకోవాలి.