వరంగల్లో పరిశుభ్రతపై అవగాహన

రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం–పచ్చదనం కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత, పచ్చదనంపై అధికారులు, ప్రజాప్రనిధులు అవగాహన కల్పిస్తున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక, పర్వతగిరి పట్టణ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో జడ్పీసీఈవో, వరంగల్ ఇన్​చార్జి డీపీవో రాంరెడ్డి పాల్గొని, హైస్కూల్ ఆవరణ, ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో మొక్కలు నాటి, స్టూడెంట్లకు కార్యక్రమంపై అవగాహన కల్పించారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో కలెక్టర్​సత్యశారదాదేవి పాల్గొని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి, గ్రామంలో పర్యటిస్తూ పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.

మహబూబాబాద్​జిల్లా నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్​కాలేజ్​లో స్థానిక ఎమ్మెల్యే భూక్యా మురళి నాయక్​పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం విద్యుత్​శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు పొలంబాట కార్యక్రమంలో పాల్గొని కరెంట్​సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. హనుమకొండ జిల్లా శాయంపేట ప్రభుత్వ జూనియర్​కాలేజ్​ఆవరణలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి, అంబేద్కర్​ సెంటర్​లో రోడ్లను ఊడ్చారు. జనగామ మున్సిపల్​పరిధిలోని 22వ వార్డులో అడిషనల్​కలెక్టర్​పింకేశ్​కుమార్​పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.