
వెలుగు, నెట్వర్క్: భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సదస్సుల్లో పాల్గొని చట్టంపై ప్రజలు, రైతులకు వివరిస్తున్నారు.
- నర్వలోని రైతువేదికలో నిర్వహించిన భూభారతి సదస్సులో నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. భూభారతి పోర్టల్ తో రైతుల సమస్యలు దూరమవుతాయని చెప్పారు. ముందుగా ఉగ్రదాడిలో చనిపోయిన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. తహసీల్దార్ మల్లారెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఏవో అఖిల పాల్గొన్నారు.
- మల్లకల్లో జరిగిన సదస్సులో గద్వాల కలెక్టర్ సంతోష్ పాల్గొని భూభారతి చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తుందని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ షాహిదా బేగం, ఏవో రాజశేఖర్ పాల్గొన్నారు.
- కొత్తకోట, మదనాపురంలో జరిగిన సదస్సుల్లో కలెక్టర్ ఆదర్శ్ సురభి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. ధరణితో రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారని, వారి ఇబ్బందులు తీర్చేందుకు మేధావుల సలహాతో భూభారతి చట్టాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలిపారు. తహసీల్దార్లు వెంకటేశ్వర్లు, అబ్రహం లింకన్, ఏఎంసీ చైర్మన్ పల్లెపాగ ప్రశాంత్ పాల్గొన్నారు.
- చారకొండ రైతు వేదిక సదస్సులో అడిషనల్ కలెక్టర్ అమరేందర్ పాల్గొని భూభారతి చట్టంపై అవేర్నెస్ కల్పించారు. భూ రికార్డుల్లో తప్పులను ప్రభుత్వం సవరించుకునే వెసులుబాటు కల్పించిందని చెప్పారు. ఆర్డీవో శ్రీనివాసులు,తహసీల్దార్ సునీత, ఎంపీడీవో ఇసాక్ హుస్సేన్, ఏవో రాజు పాల్గొన్నారు.
- హన్వాడ జడ్పీ హైస్కూల్ ఆవరణలో జరిగిన భూభారతి అవగాహన సదస్సులో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. గత ప్రభుత్వం ధరణి పేరుతో కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టిందని విమర్శించారు. మండలంలోని ఇబ్రహీంబాద్ గ్రామానికి చెందిన నలుగురు లబ్ధిదారులకు మహిళా సమైక్య ద్వారా రూ.50 వేల చొప్పున చెక్కులను కలెక్టర్ విజయేందిర బోయితో కలిసి అందజేశారు.
- రైతుల భూములకు భూభారతి రక్షణ కవచంలా ఉంటుందని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. అచ్చంపేట మండలం పులిజాల సదస్సులో పాల్గొన్న రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎమ్మెల్యే మాట్లాడారు. రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. ఆర్డీవో మాధవి, తహసీల్దార్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
- కోయిలకొండలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో నారాయణపేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి పాల్గొని మాట్లాడారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందించారు. కలెక్టర్ విజయేందిర బోయి, అడిషనల్ కలెక్టర్ మోహన్ రావు,ఆర్డీవో నవీన్ పాల్గొన్నారు.