యువతను మత్తు విపత్తులోకి జారనీయొద్దు

దేశ భవిష్యత్​కు పునాదిగా నిలవాల్సిన యువత ఆల్కహాలు, మాదక ద్రవ్యాల మత్తులో జోగుతోంది. నరనరాల్లోకి ప్రవహింపజేసుకుంటూ తమ భవిష్యత్​ను అంధకారంలోకి నెడుతోంది. రోజూ దుకాణాల్లో, లారీల్లో, ట్రక్కుల్లో, రైళ్లలో నిత్యం పట్టుబడుతున్న గంజాయి కేసులు.. సమస్య తీవ్రతను చెప్పకనే చెబుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా.. ఎంత మంది పోలీసులు పహారా కాసినా కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఇది కేవలం నిఘా విభాగాలు, నియంత్రణ వ్యవస్థలు, దర్యాప్తు సంస్థల బాధ్యత మాత్రమేనా? ప్రభుత్వాలను నిందిస్తూ కూర్చోవడమేనా? పౌర సమాజానికి ఏ బాధ్యత లేదా?  సమస్య తీవ్రతను తెలిపి, రాగల విపరిణామాలను వివరించి.. విలువైన జీవితాలను మత్తు విపత్తులోకి జారనీయకుండా యువతలో అవగాహన, చైతన్యం తీసుకురావాల్సిన అవసరం లేదా? ఆలోచించండి.

మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వలన కలిగే విపరీత పరిణామాలను అవగతం చేసుకున్న అంతర్జాతీయ సమాజం డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నప్పటికీ, డ్రగ్స్ మహమ్మారి ఇంకా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నదే తప్ప, సమసి పోవడం లేదు. 1987 లో  వియన్నాలో అంతర్జాతీయ  డ్రగ్స్ వ్యతిరేక సదస్సు జరిగింది. క్రమేపీ ప్రపంచంలోని అన్ని దేశాలు డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తూ చట్టాలకు పదును పెడుతున్నాయి.1987లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ డ్రగ్స్ లేని అంతర్జాతీయ సమాజం కోసం పిలుపునిచ్చింది.1989 లో జరిగిన యూఎన్​వో సదస్సు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోరాడాలని, ప్రజలకు వీటి వినియోగం వలన కలిగే దుష్ఫలితాలపై అవగాహన కలిగించాలని నిర్ణయించుకుని కార్యాచరణ ప్రణాళిక రచించినా, ఫలితం మాత్రం  ఆశించిన రీతిలో లేదు. 1998లో యూఎన్​వో జనరల్ అసెంబ్లీ ‘గ్లోబల్ డ్రగ్స్’ సమస్యపై ఒక తీర్మానం ఆమోదించింది. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఎన్ని ప్రచారోద్యమాలు జరిగినా వీటి అక్రమ రవాణా పై ఉక్కుపాదం మోపాలని అంతర్జాతీయ సమాజానికి మార్గనిర్దేశనం చేసినా, డ్రగ్స్ వినియోగం ఏ మాత్రం తగ్గడం లేదు. మద్యం వ్యసనంతో పాటు డ్రగ్స్ వ్యసనం కూడా సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నది. 

ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ‘యున్ఓడీసీ’  ఏండ్ల తరబడి ఇతర అంతర్జాతీయ సంస్థలతో కలిసి, డ్రగ్స్ పై పోరాటానికి, ప్రజల్లో చైతన్యం కలిగించడానికి కృషి చేస్తోంది. మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్పరిణామాల వలన  వివిధ దేశాల ప్రభుత్వాలు ఎన్నో సమస్యలను  ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 200 మిలియన్ల మందికి పైగా డ్రగ్స్ కు  బానిసలని కొకైన్, మార్జువానా, మార్ఫిన్, చరస్, హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా వినియోగిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇతర దేశాల విషయం పక్కన బెడితే భారత ప్రభుత్వం 1985లోనే మాదక ద్రవ్యాల వ్యతిరేక చట్టం ‘ఎన్​డీపీఎస్’ తీసుకువచ్చింది. తర్వాత పలు సవరణలతో ఈ చట్టాన్ని పటిష్టం చేసింది. అయితే చట్టాలెన్ని చేసినా ప్రజల దృక్పథంలో మార్పు రానంతకాలం ఇవి కేవలం కాగితాలకే పరిమితం కాక తప్పదు. ప్రజల్లో వివేచన పెరగాలె.

క్రమశిక్షణ ఉంటేనే..

క్రమశిక్షణతో కూడిన మంచి చెడులను బోధించే విద్యావిధానం రావాలి. నూతన విద్యావిధానంలో మరికొన్ని మార్పులు చేసి, విలువలకు అగ్రతాంబూలమివ్వాలి. మానసిక పరిపక్వత లేని చదువుల వలన వివేకం అబ్బడం లేదు. చిన్నవయసు నుంచే పెద్దలను ఎదురించడం, యుక్త వయసు వచ్చాక వ్యసనాలకు అలవాటుపడి  విచ్చలవిడిగా డబ్బు ఖర్చుచేయడం, డబ్బు లేక పోతే సంఘ విద్రోహులుగా మారి దేశానికి భారంగా మారడం మనం చూస్తున్నాం. అసహజమైన రీతిలో వికృతంగా మారే వ్యక్తుల వలన సమాజంలో శాంతి భద్రతలు కరువై ఆటవిక ప్రవర్తన వేళ్లూనుకుంటున్నది. ఆల్కహాలిజం వలన యువత నిత్యం మత్తులో తూలుతోంది. ఇది చాలదన్నట్టు మాదక ద్రవ్యాల వ్యసనం మహమ్మారిలా తయారైంది. అతి భయంకరమైన డ్రగ్స్ భూతానికి మానవ వనరులన్నీ నిర్వీర్యమైపోతున్నాయి. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువత చేయలేని దుర్మార్గమంటూ ఏదీ లేదు. మత్తులో చిత్తయి, వారి అలవాట్లకు, అవసరాలకు సంఘ విద్రోహుల వలలో చిక్కి యువత అసాంఘిక కార్యకాలాపాల వైపు పయనించడం ఆందోళన కలిగించే విషయం.

డ్రగ్స్​ లేని సమాజం కోసం..

డ్రగ్స్​కు బానిసలై ఉగ్రవాదులుగా మారుతున్న వారెంతో మంది సమాజానికి చీడపురుగుల్లా తయారవుతున్నారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటూ, అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. వీరి వలన అభివృద్ధి ఆగిపోతోంది. విద్య, వైద్య, ఆరోగ్యం, అభివృద్ధి వంటి వాటిపై దృష్టి పెట్టవలసిన ప్రభుత్వాలు సింహభాగం నిధులను అరాచకశక్తుల అణచివేతకోసం, బాహ్య, ఆంతరంగిక, అసాంఘిక శక్తులను అడ్డుకోవడానికే వెచ్చించవలసి వస్తున్నది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు ప్రజోపయోగకరమైన కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్య, ఆరోగ్యం వంటి అంశాలపై అధిక నిధులు వెచ్చించలేకపోతున్నది. ఇలాంటి పరిస్థితులు మారాలి. మత్తులో తూలుతున్న యువతను ఆ మత్తు నుంచి బయటకు తీసుకురావాలి. సకల అనర్ధాలకు సమాజంలో చోటుచేసుకుంటున్న అరాచకాలకు, అమానుషత్వ ధోరణులకు మత్తే  ప్రధాన కారణంగా అనేక సర్వేలు సూచిస్తున్నాయి. మానసిక ప్రవర్తనలో విపరీతమైన ధోరణులను ప్రేరేపించి, అరాచకత్వానికి నాంది పలుకుతున్న డ్రగ్స్ ను యువత నుంచి దూరం చేయాలి. డ్రగ్స్ లేని సమాజాన్ని రూపొందించడానికి అంతర్జాతీయ సమాజం మరింత కృషి చేయాలి.  డ్రగ్స్ మహమ్మారిని పారదోలి వివేకవంతమైన సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలి. 
 - సుంకవల్లి సత్తిరాజు,
సోషల్ ఎనలిస్ట్