వనపర్తి, వెలుగు: సవరణ చేసిన మూడు కొత్త చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని హైకోర్టు జడ్జి, వనపర్తి కోర్టు అడ్మినిస్ట్రేటివ్ జడ్జి లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. శనివారం ఆయన వనపర్తి కోర్టులో జరిగిన జ్యుడీషియల్ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.
కోర్టు లైబ్రరీ, విట్ నెస్ రూమ్‌లను ఆయన ప్రారంభించారు. బార్ అసోసియేషన్ బిల్డింగ్‌ను సందర్శించి మాట్లాడారు. మూడు చట్టాల్లో వచ్చిన మార్పులను కింది స్థాయి సిబ్బందికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయమూర్తులు, లాయర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రజలకు అర్థమయ్యేలా చూడాలన్నారు. జిల్లా ఇంటిగ్రేటెడ్ కోర్టు కొత్త భవనానికి, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానన్నారు.
జిల్లా జడ్జి సునీత, సబ్ జడ్జి రజని, జూనియర్ జడ్జీలు రవికుమార్, జానకి, శ్రీలత, ఆత్మకూరు జడ్జి శిరీష, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోహన్‌కుమార్ యాదవ్, ప్రధానకార్యదర్శి బాలనాగయ్య, అడ్వకేట్లు నాగేశ్వర్, పురుషోత్తం, శ్రీనివాసాచారి, భరత్‌కుమార్ పాల్గొన్నారు.