- ఉద్యోగం కావాలంటే డబ్బులు కట్టడంతో పాటు
- మరో నలుగురిని చేర్పించాలని కండీషన్
- తప్పించుకొని ఖమ్మం చేరుకున్న కొందరు యువతీయువకులు
- చండీగఢ్‌లో ఇంకా వందలాది మంది ఉన్నట్లు సమాచారం
ఖమ్మం/ ఖమ్మం టౌన్, వెలుగు : ఉద్యోగాలు ఇస్తామంటూ విస్తృతంగా ప్రచారం చేసుకొని, నిరుద్యోగుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేసిన ఓ కంపెనీ చివరకు మోసం చేసింది. ఇదేమని ప్రశ్నించిన ఓ యువతిని చంపుతామని బెదిరించడంతో ఆమె అక్కడి నుంచి తప్పించుకొని ఖమ్మం సీపీకి ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే... చండీగఢ్‌లోని అవిన్మో ఇండియా మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తి చేసినా ఉద్యోగాలు రాకుండా ఖాళీగా ఉన్న నిరుద్యోగులను టార్గెట్ చేసింది.
వారికి డేటా ఎంట్రీ, బార్‌కోడ్, క్యూఆర్ కోడ్ క్రియేషన్ వర్క్ ఇప్పిస్తామని, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకున్నా నెలకు రూ. 30 వేల నుంచి రూ. 40 వేలు సంపాదించుకోవచ్చని ప్రచారం చేసింది. దీనిని నమ్మిన నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, విశాఖ, గుంటూరు జిల్లాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది యువతీయువకులు సంస్థ సూచన మేరకు చండీగఢ్ వెళ్లారు. వారి నుంచి రూ. 3 వేలు కట్టించుకొని మూడు రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చారు.
తర్వాత రూ. 70 వేలు కడితే.. రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల జీతం వచ్చే అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ వస్తుందంటూ నిర్వాహకులు నమ్మించారు. కొందరు నిరుద్యోగులు తమ పేరెంట్స్‌కు ఫోన్ చేసి, డబ్బులు తెప్పించుకొని సంస్థకు చెల్లించారు. తీరా డబ్బులు కట్టిన తర్వాత ఉద్యోగం రావాలంటే.. ఒక్కొక్కరు మరో నలుగురిని చేర్పించాలని కండిషన్ పెట్టారు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన మధులత అనే యువతితో పాటు మరికొందరు నిర్వాహకులను నిలదీయగా చంపుతామని బెదిరించారు. సదరు యువతి అక్కడి నుంచి తప్పించుకొని రైలులో తెలంగాణకు వస్తూ వీడియో ద్వారా ఖమ్మం సీపీకి ఫిర్యాదు చేసింది.
దీంతో వరంగల్‌లో ఉన్న యువతితో పాటు మరో 15 మందిని బుధవారం సాయంత్రం ఖమ్మం తీసుకొచ్చారు. అనంతరం వారిని స్వస్థలాలకు పంపించారు. చండీగఢ్‌తో పాటు మొహాలీలో సుమారు 1,500 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతీయువకులు చిక్కుకున్నారని బాధితులు తెలిపారు. చండీగఢ్‌లో చిక్కుకున్న వారిలో ఎక్కువగా గురుకులాల్లో చదువుకున్న యువతీయువకులే ఉన్నట్టు సమాచారం.