మహబూబ్‌నగర్/చిన్నచింతకుంట, వెలుగు: ఏక్ ఫసల్ భూముల కోసం చెరువులోకి నీళ్లు రాకుండా వరద కాలువను కొందరు వ్యక్తులు డైవర్షన్ చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం మద్దూరు గ్రామంలోని చెరువు చుట్టూ కందకాలు తవ్వి నీరు నిల్వ ఉండకుండా చేస్తుండడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. మద్దూరు గ్రామంలో 150 ఏండ్ల కింద గ్రామ పెద్దలు సాగునీటి కోసం సుంకరి చెరువును తవ్వించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ చెరువు 140 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని కింద 250 ఎకరాల ఆయకట్టు ఉంది. 173, 174, 175, 176, 177, 178, 192 సర్వే నెంబర్లలో 74 ఎకరాల ఏక్ ఫసల్ భూములు, 9.24 ఎకరాల శిఖం భూములున్నాయి. ఏక్ ఫసల్ భూములు గ్రామానికి చెందిన 12 మంది రైతుల పేరు మీద ఉండేవి. వాటిని ఏడాది కింద హైదరాబాద్, ఏపీలోని వ్యక్తులకు అమ్మేశారు. ఈ భూములను కొన్న వారు రెండు నెలలుగా ఏక్ ఫసల్ భూముల స్వరూపాన్ని మార్చేయడం వివాదాస్పదంగా మారుతోంది.
చెరువులోకి నీళ్లు రాకుండా..
కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కింద మద్దూరు గొలుసుకట్టు చెరువుగా ఉంది. ఈ ప్రాజెక్టు కింద గొలుసుకట్టు చెరువులను నింపేందుకు ఎర్ర కాల్వ ద్వారా ఇరిగేషన్ ఆఫీసర్లు నీటిని వదులుతున్నారు. అయితే చెరువు వద్ద ఎర్ర కాల్వను ఏక్ ఫసల్ పొలాలు కొన్న వ్యక్తులు డైవర్ట్ చేశారు. చెరువుకు కుడి, ఎడమ వైపు సమాంతరంగా రెండు కాల్వలను 20 ఫీట్ల లోతుతో తవ్వించారు. ఒక కాల్వ ద్వారా చెరువుకు ఎగువ నుంచి వరద నీటిని తరలించేందుకు, మరో కాల్వ ద్వారా ఎర్ర కాల్వ నుంచి వచ్చే నీటిని డైరెక్ట్‌గా చెరువు అలుగు వద్దకు వెళ్లేలా డిజైన్ చేశారు. వీరు ఏక్ ఫసల్ భూముల్లో చుక్క నీరు నిల్వ ఉండకుండా, పొలాల్లోకి నీరు చేరకుండా కాల్వల కోసం తీసిన మట్టితో పక్కనే కట్ట ఏర్పాటు చేశారు.
అలుగు కాల్వ దెబ్బతినే ప్రమాదం..
ఈ చెరువు నిండితే అలుగు నుంచి కాల్వ ద్వారా నీరు వనపర్తి జిల్లా ఆత్మకూరు దేవుని చెరువుకు చేరుతుంది. ప్రస్తుతం సుంకరి చెరువులో నీరు నిల్వ ఉండకుండా కాల్వలను డైవర్ట్ చేయడంతో వర్షాకాలంలో వచ్చే వరదలకు చెరువు అలుగు కాల్వ తెగిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. అలుగు కింద ఉన్న 150 ఎకరాల భూములు ముంపునకు గురయ్యే అవకాశం ఉండగా, చెరువు కట్ట తెగితే మరో 60 ఎకరాలపై ప్రభావం పడుతుందని పేర్కొంటున్నారు. అమరచింత, మద్దూరు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది.
ఆఫీసర్లు వార్నింగ్ ఇచ్చినా..
రెండు నెలలుగా కాల్వ పనులు చేస్తుండగా, రైతులు ఆందోళనకు దిగారు. ఏప్రిల్ 21న చిన్నచింతకుంట తహసీల్దార్ సువర్ణ రాజుకు రైతులు కంప్లైంట్ చేశారు. ఇరిగేషన్ ఆఫీసర్లు గత నెల 25న చెరువును సందర్శించారు. వెంటనే పనులు ఆపేయాలని ఆదేశించారు. నీటిని డైవర్ట్ చేయవద్దని, చెరువులో నీరు నిల్వ ఉండాల్సిందేనని వారికి చెప్పారు.
నీరు రాకుండా ఏర్పాటు చేసిన రెండు కాల్వలను పూడ్చేయాలని ఆదేశించారు. 10 రోజులు గడస్తున్నా కాల్వలను పూడ్చలేదు.
మా పంటలకు నీళ్లెట్లా?
నాకు చెరువు పక్కనే పది ఎకరాల భూమి ఉంది. వానాకాలం సీజన్లో చెరువు ఆధారంగా వరి పండిస్తా. చెరువులో నీరు నిల్వ ఉండకుండా కాలువలను డైవర్ట్ చేస్తే మా పంటలు ఎలా పండించుకోవాలి? దీనిపై ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలి. - బుచ్చన్న, రైతు, మద్దూరు
కాల్వలను పూడ్చాలని చెప్పాం..
మద్దూరు సుంకరి చెరువుపైన వరద నీరు రాకుండా నిర్మించిన కాల్వలను త్వరలో పూడిపిస్తాం. చెరువులోకి నీరు రాకుండా కాల్వలు తీయడం తప్పు. ఈ విషయంపై ఆర్డీవోకు సంబంధింత పట్టాదారులపై కంప్లైంట్ చేశాం. - గోపాలాచారి, ఇరిగేషన్ డీఈ, మహబూబ్‌నగర్
ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లాం..
ప్రభుత్వం చెరువుల్లోని భూములను రైతులకు పట్టా చేసేటప్పుడే అందులో ఏక్ ఫసల్ భూమి రికార్డ్ చేస్తుంది. వానాకాలం చెరువులో నీరు నిల్వ చేసి, చెరువు కింద ఉన్న ఆయకట్టుకు నీళ్లివ్వాలి. చెరువులో నీళ్లు ఇంకిపోయాక పట్టాదారులు పంటలు వేసుకోవాలి. ఇదే ప్రభుత్వ నిబంధన. మద్దూరు గ్రామంలోని సుంకరి చెరువులో ఏక్ ఫసల్ భూములున్నాయి. అక్కడి చెరువు స్వభావాన్ని మార్చేశారు. ఈ విషయాన్ని ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లాం.- సువర్ణ రాజు, తహసీల్దార్, చిన్నచింతకుంట