- ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హెచ్చరిక
టెహ్రాన్: ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోవడంలో వెనక్కి తగ్గినా లేదా రాజీపడినా దైవాగ్రహానికి గురికాక తప్పదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అన్నారు. గత నెలలో టెహ్రాన్‌లో హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్య తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఖమేనీ ఈ ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ పై ప్రతీకారం విషయంలో సైనిక, రాజకీయ లేదా ఆర్థికపరమైన ఎలాంటి తిరోగమనానికి పాల్పడినా తీవ్రమైన దైవ శిక్షను అనుభవించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
దేశం పరిమాణం లేదా బలంతో సంబంధం లేకుండా నేటి ఆధిపత్య శక్తుల డిమాండ్లకు లొంగిపోయే ప్రభుత్వాలు.. తమ ప్రజల బలాన్ని ఉపయోగించుకుని ప్రత్యర్థుల నిజమైన సామర్థ్యాలను కచ్చితంగా అంచనా వేస్తే ఈ ఒత్తిళ్లను ధిక్కరించగలవని ఇరాన్ పరిస్థితిని ఉటంకిస్తూ ఖమేనీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన 1979 నాటి ఇస్లామిక్ విప్లవం నుంచి ఇరాన్‌ను అణగదొక్కడానికి యూఎస్, బ్రిటన్, ఇజ్రాయెల్ ప్రయత్నించాయంటూ చారిత్రక ఘటనలను ఉదాహరణలుగా ఆయన గుర్తుచేశారు. శత్రువుల శక్తిని అతిగా ఊహించుకోవద్దని పేర్కొన్నారు.