
అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రధాని మోదీ చేతుల మీదుగా ఘనంగా జరిగింది. గతంలో సుప్రీంకోర్టు అయోధ్యలో మసీదు కోసం 5 ఎకరాలు కేటాయించాలని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మసీదును ఎప్పుడు నిర్మిస్తారనే ఆసక్తి నెలకొంది. 2019లో సుప్రీం ఇచ్చిన తీర్పు మేరకు అయోధ్యకు 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధన్నీపూర్లో.. 5 ఎకరాల స్థలాన్ని మసీదు నిర్మాణానికి స్థలం కేటాయించారు. ఇక్కడ మసీదును నిర్మించేందుకు ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (IICF) డెవలప్‌మెంట్ కమిటీ సిద్ధమైంది.
రీడిజైన్ వల్లే ఆలస్యం
పవిత్ర రంజాన్ నెల తర్వాత ఈ ఏడాది మే నెలలో మసీదు నిర్మాణం మొదలుపెడతామని.. ఐఐసీఎఫ్ డెవలప్‌మెంట్ కమిటీకి నాయకత్వం వహిస్తున్న హాజీ అర్ఫత్ షేక్ వెల్లడించారు. 3 నుంచి 4 ఏళ్లో మసీదు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అయితే రీడిజైన్ వల్లే మసీదు నిర్మాణం ఆలస్యమైనట్లు ఐఐసీఎఫ్ కార్యదర్శి అథర్ హుస్సేన్ అన్నారు. మసీదు ప్రాజెక్ట్ కాంప్లెక్స్‌లో 500 పడకల ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేసేలా ప్రణాళిక కూడా చేసినట్లు చెప్పారు.
నిధులు లేవు
అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం దాదాపు 3 వేల కోట్లకు పైగా విరాళాలు అందాయని.. కానీ మసీదు నిర్మాణానికి నిధుల కొరత ఉందని ఐఐసీఎఫ్ ప్రెసిడెంట్ జుఫర్ అహ్మద్ ఫరూఖీ అన్నారు. ఇప్పటివరకు నిధుల కొరకు తాము ఎవరినీ సంప్రదించలేదని.. ఎలాంటి ఉద్యమం చేపట్టలేదని చెప్పారు. అంతేకాదు.. భారత్‌లో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన బాబర్ చక్రవర్తి పేరుతో ఉన్న బాబ్రీ మసీదు పేరును కూడా తొలగించనున్నారు. కొత్తగా నిర్మించబోయే మసీదుకు బిన్ అబ్దుల్లా మసీదుగా పేరు పెడతామని ఐఐసీఎఫ్ సెక్రటరి అథర్ హుస్సేన్ తెలిపారు.
త్వరలోనే మసీదు నిర్మాణం కోసం నిధులు సేకరించేందుకు క్రౌడ్ ఫండింగ్ వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తామని బీజేపీ లీడర్ అరాఫత్ షేక్ అన్నారు ‘ప్రజల మధ్య శత్రుత్వం, ద్వేషం తొలగించి, ఒకరిపై ఒకరు ప్రేమగా మార్చడమే మా ప్రయత్నమన్నారు. మన పిల్లలకు, ప్రజలకు మంచి విషయాలు నేర్పితే ఈ తగాదాలన్నీ ఆగిపోతాయన్నారు. మసీదు నిర్మాణంలో ఆలస్యమవుతోందని, డిజైన్‌లో మరిన్ని సంప్రదాయ అంశాలను జోడించాలని కోరుతున్నామని ఐఐసిఎఫ్ సెక్రటరీ అథర్ హుస్సేన్ చెప్పారు.