అయోధ్య వేడుకలు.. దేశమంతా లైవ్

అయోధ్య వేడుకలు.. దేశమంతా లైవ్
  • గ్రామాల్లోనూ భారీ స్క్రీన్ల ఏర్పాటుకు బీజేపీ సన్నాహాలు 
  • ఈ నెల 16 నుంచే పూజలు ప్రారంభం
  • 14 నుంచి 22 వరకూ అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు

అయోధ్య (యూపీ): అయోధ్యలో ఈ నెల 22న శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను దేశమంతటా లైవ్ టెలికాస్ట్ చేసేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. పట్టణాలు, పల్లెల్లో బూత్ లెవెల్​లో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసి వేడుకలను లైవ్​లో ప్రదర్శించేందుకు సిద్ధమవుతోంది. వేడుకలు జరిగే రోజున అయోధ్యకు అందరూ వచ్చే అవకాశంలేనందున ప్రతి సామాన్యుడు ఉన్న చోటి నుంచే వేడుకలను వీక్షిస్తూ, బాల రాముడిని దర్శించుకునేలా చూడాలని పార్టీ భావిస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని హైకమాండ్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆ రోజున భక్తులకు అన్నదానాలు, పండ్లు, దుప్పట్ల పంపిణీ వంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని కూడా పార్టీ ఆదేశించినట్లు పేర్కొన్నాయి. 

వారం ముందు నుంచే పూజలు..  

శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన క్రతువులు ప్రధాన కార్యక్రమానికి వారం రోజులు ముందుగా ఈ నెల 16వ తేదీ నుంచే ప్రారంభం కానున్నాయి. వారణాసికి చెందిన ప్రముఖ వేద పండితుడు లక్ష్మీకాంత్ దీక్షిత్  ఆధ్వర్యంలో 22న రామ్ లల్లా(బాల రాముడు) విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. అయోధ్యలో ఈ నెల 14 నుంచి 22 వరకూ అమృత్ మహోత్సవ్ పేరిట రోజూ ప్రత్యేక కార్యక్రమాలు సైతం నిర్వహించనున్నారు. ఇక వేడుకలకు వచ్చే వేలాది మంది భక్తుల కోసం అయోధ్యలో టెంట్ సిటీలు ఏర్పాటు చేస్తున్నారు. వారికి భోజనం, వసతితో పాటు అవసరమైన సౌలతులు కల్పిస్తున్నారు. రామ జన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 15 వేల మంది బస చేసేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

అయోధ్య యాత్రలకు బీజేపీ ప్లాన్ 

అయోధ్యలో రాముడి గుడి నిర్మాణం పూర్తవు తుండటంతో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. అలాగే రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ తర్వాత దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి అయోధ్యకు తీర్థయాత్ర లను చేపట్టాలని పార్టీ ప్రణాళికలు వేస్తోంది. భక్తులను పెద్ద ఎత్తున అయోధ్యకు తరలించి రాముడి దర్శనం చేయించాలని యోచిస్తోంది.