
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమయిన అయోధ్య రామాలయానికి బాంబు బెదిరింపు వార్త కలకలం రేగింది. కొంతమంది అయోధ్య రామాలయాన్ని పేల్చేస్తామని కలెక్టరేట్లకు ఈ మెయిల్స్ పంపారు. వెంటనే భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు...చుట్టుపక్కల ప్రాంతల్లోని సీసీ టీవీలను పరిశీలించి.. అయోధ్య సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదుచేశారు. తమిళనాడు నుంచి ఇంగ్లీష్‌లో మెయిల్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఆ మెయిల్‌పై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.అయోధ్యతో పాటు, బారాబంకి.. ఇతర జిల్లాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు.
అయితే ఇదే మొదటి సారి కాదు.. గతంలో కూడా అయోధ్య ఆలయాన్ని పేల్చేస్తామని బెదిరింపు వచ్చింది. ఖలీస్థానీ ఉగ్రవాది పన్నూ బెదిరించాడు. రామాలయానికి ఉగ్రవాదుల ముప్పు దృష్ట్యా అయోధ్య నగరంలోనూ, రామాలయ పరిసర ప్రాంతాల్లోనూ అత్యాధునిక భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం ఈ ప్రాంతాన్ని డ్రోన్ నిఘాలోకి తీసుకొచ్చారు.ఆలయ భద్రత కోసం దాదాపు 4 కిలోమీటర్ల గోడ నిర్మాణాన్ని ప్రారంభించామని రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఈ గోడ నిర్మాణాన్ని ఇంజినీర్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ నిర్వహిస్తోందని... 18 నెలల్లో పూర్తి కానుందని ఆయన వెల్లడించారు.