పన్నెండేళ్ల వెంకటేశు బాల్యమంతా గాయాలమయం. అమ్మ చనిపోయినందువల్ల, నాన్న ఎడతెగని బాధలు పెడుతున్నందువల్ల చావాలనుకున్నాడు. రైలుకింద పడాలని ‘అక్కన్నపేట రైల్వేస్టేషన్’ కు వెళ్లాడు. ఇంతలో చింపిరిచింపిరిగా తెల్లజుట్టు, లోతుకు పోయిన కళ్ళు, కళ తప్పిన ముఖం- అయినా పెదాలపై చిరునవ్వు ఉన్న 50 ఏళ్ల స్త్రీ అతన్ని పిలిచింది. ఆప్యాయంగా మాట్లాడింది. అతని బాధ విన్నది. ఒకే ఒక్క ప్రశ్న వేసింది. ఆ ప్రశ్న అతనికి తెలియని కొత్త కోణాన్ని, కొత్త మార్గాన్ని చూపింది. ఆమె అతని దృష్టిలో ఒక అమ్మ, ఒక దేవత అయింది. ఎ.యం. అయోధ్యారెడ్డి రాసిన ఈ కథా సంపుటిలో ఇది కాక, ఇంకా 13 కథలున్నాయి.
‘ఆమెలోని నది’ మరింత ఆర్ద్రంగా ఉంది. ఆమెకు నాన్న లేడు. ఓ పెంకుటింట్లో ఉండేది. ఆ ఇంటి ముందు ఎప్పుడూ అమ్మాయిలు నిలబడి ఉండేవారు. ఆమె ఆ ‘వృత్తి చేస్తూ అమ్మకోసం, జబ్బుపడి అందర్లా మామూలు జీవితాన్ని గడపలేని తమ్ముని కోసం డబ్బు పంపించేది. ఆ ఊళ్లో స్కూల్లో చదువుతున్న చినబాబును పిలిచి అమ్మకు ఉత్తరం రాయించుకునేది. ఆ స్నేహాన్ని అపార్థం చేసుకున్న అతని నాన్న అతనిని చదువు కోసం బెంగళూరు పంపించాడు. ఏళ్లు గడిచాయి. అతడిప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఆమె పట్నంకు మకాం మార్చింది. ఒకరోజు కనిపించింది. ఇంటికి తీసుకెళ్లింది. చాలా రోజులు నీకోసం పిచ్చిదానిలా ఎదురుచూశానని, కనిపించవని తెలిసి ఎన్నోసార్లు ఏడ్చానని, అమ్మ చనిపోయిందని, అమ్మకంటే ముందు తమ్ముడూ చనిపోయాడని చెప్పింది. ఆమె చేతిలో రాఖీ ఉంది. కట్టించుకోవడానికి తమ్ముడు లేడు. ఆ రాఖీ తనకు కట్టమన్నాడు. ఆమెలో ఆనందం, దుఃఖం ఒకేసారి పోటీపడుతూ ముందుకు దూకాయి.
‘పేగు ముడి’ కథలో నిస్సహాయత సావిత్రిని దహించి వేస్తుంది. పుట్టబోయేది పాప అని తెలుసు కుని, తన అభిప్రాయానికి విలువ లేకుండా, రెండు సార్లు అబార్షన్ చేయించాడు భర్త. ఇప్పుడు మూడోసారీ చేయించబోతున్నాడు. మొదటిసారి అబార్షన్ చేయించబడిన పాప కలలో కనిపించింది. నా జీవితాన్ని అర్థంతరం చేసే హక్కు నీకెక్కడిది అని తనను నిలదీసింది. ఆమె అస్వతంత్రురాలు. పుట్టబోయే పాపతో సహా ఆరంతస్తుల భవనంపై నుంచి దూకి తనువు చాలించింది. ‘చావు వాసన’ కొడుకులు నిరాదరించిన వృద్ధ దంపతుల కథ. ఆస్తిని కాజేశారు. నెట్టి వేశారు. ఆ వృద్ధుడు వీరయ్య పట్నంలో, పాణం బాగాలేని భార్య కోసం ‘అడుక్కుంటున్నాడు’. ఈ లోకంలో మనుషులకు ఆకలి ఒక్కటే భయంకరమైన సమస్య కాదని, నిరాదరణ ప్రేమరాహిత్యం కూడ అంతకన్న భయంకరమైనవేనని తెలిపే కథ ఇది.
‘గాలివాన’ కథలో - నాలుగు దినాల సంది ఒకటే వాన. సంజీవరావు దొరగా వాసల కొమురయ్యను పట్నం పోయిరమ్మంటాడు. పోనంటే దొర ఇష్టమచ్చినట్టు తిట్టిండు. ఇయ్యరమయ్యర కొట్టిండు. ‘‘నీ గుడిసె నేలమట్టం చేయిస్త. నీ పెండ్లాం, పోరగాండ్లను గా యేట్లోనే కలిపేస్త’’ అని బెదిరిచ్చిండు. కొమురయ్య బయిలెల్లిండు. దారిలో హోరు పెద్దదైంది. తుమ్మతుప్పల్ల పీసుగై శిక్కుకున్నడు కొమురయ్య. ‘పాముల నడుమ చీము’ లో గారడి విద్య చూపించి జనం దగ్గర డబ్బులడుక్కొని పొట్టపోసుకునే బాలీరును, మాయోపాయంతో మోసం చేసి చచ్చిపోయేటట్లు చేసిండు దొర. దుర్మార్గుల అరాచకత్వానికి అమాయకుల బతుకులు బుగ్గి అయిన తీరును తెలిపే కథలివి.
‘ఇడ్లీ పొట్లం’ కథలో ‘‘మనిషి బత్కాలన్నా... నాలుగు పైసలు సంపాయించాలన్నా ముందు బొండిగెల పాణముండాలె గద. పాణముండాల్నంటే ఆకలి దీరాలె. గీ లోకంల ఆకలిని మించింది ఏముంది సారూ!’’ అంటడు యాదగిరి. తూకం, అదురుట్టం సూసుకుందామని ‘కొత్త బస్టాండు’ కు పోయి మిషిన్ల ఎంకటి రెండ్రూపాయల బిల్లలేస్తే దురదురుట్టం ఎక్కిరించింది. ‘ఒక రచయిత మరణం’ కథలో ఓ రచయిత సృజనాత్మకత, సామాజికత రంగరించి గొప్ప కథ రాసి పోటీకి పంపిండు. ఆ కథ బహుమతికి కాదు కదా ప్రచురణకు కూడ నోచుకోలేదు. మళ్ళీ కథ రాసే ప్రయత్నం చేయలేదు. ‘రెప్పచాటు కన్నీరు’ కథ - పైకి మంచిగా కనపడే వాళ్లంతా మంచివాళ్ళేనని భ్రమ పడరాదని తెలియజేసింది. భర్తను ఆడిపోసుకునే భార్యను అదే భర్త మెడ చుట్టూ చెయ్యేసి గుండెను ఒదిగి పడుకునేలా చేసింది. వెంటాడిన రాత్రి, ఏన్ అనాథరైజ్డ్ లవ్ స్టోరీ, శిథిల అనే మూడు కథలను పూర్తిగా చదివిన ఆడపిల్లలు ప్రేమపేరుతో వంచించే మగవాళ్ల చేతిలో మోసపోరు. అప్రమత్తంగా ఉంటారు. తమ జీవితాలను అందంగా మలచుకుంటారు. ‘నీడను పట్టుకున్నవాడు’ కథలో దినకర్ వసంతల పెళ్లయి మూడు నెలలవుతుంది. మంచిరోజులు లేవన్న పెద్దల మాటలతో ఆమెను కాపురానికి తీసుకపోలేదు. ఈ మూడు నెలలుగా కొత్త దంపతుల మధ్య విరహం మామూలుగా లేదు. ఫోన్లో గంటలు గంటలు ముచ్చట్లు. వీడియో కాల్స్ తీయతీయని సంభాషణలు. కొత్తకాపురం ఎప్పుడెప్పుడా అని ఆత్రుత. కాలం త్వరగా కరిగిపోతే బాగుండన్న ఆరాటం. మొత్తానికి ఓ మంచిరోజు నిర్ణయించారు. వసంత స్వయంగా ఆ విషయాన్ని దినకర్ చెవిన వేసింది. ఫలితంగా ప్రయాణమయ్యాడు. ప్రయాణం ఎలా సాగింది? పరిణామం ఏం జరిగింది? తెలుసుకోవాలంటే ఈ కథ చదవాలి. ఈ సంపుటిలో బరువైన కథలు, బలమైన కథనాలు. అయోధ్యారెడ్డిది తనదైన శైలి. ప్రతి సంభాషణ మనల్ని కదిలించి వేస్తుంది. ప్రతి కథ మనల్ని కట్టి పడేస్తుంది.
- ఎ. గజేందర్ రెడ్డి
9848894086