- 28 లక్షల దీపాలతో మరో గిన్నిస్ రికార్డుకు సర్వం సిద్ధం
- వేడుకలో పాల్గొననున్న ప్రధాని మోదీ, యూపీ సీఎం, తదితరులు
న్యూఢిల్లీ, వెలుగు: చోటీ దీపావళి (దీపోత్సవం) సందర్భంగా బుధవారం అయోధ్య నగరం దేదీప్యమానంగా వెలిగిపోనుంది. మరో గిన్నిస్ వరల్డ్ రికార్డుకు అయోధ్యాపురి ముస్తాబైంది. ఈసారి 28 లక్షల దీపాల వెలుగులతో సరయూ తీరం కాంతులీననుంది. బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన తర్వాత జరుగుతున్న తొలి దీపావళి కావడంతో భారీగా ఏర్పాట్లు చేశారు.
యూపీ ప్రభుత్వం, రామ మందిర ట్రస్ట్, ఎన్జీవోలు కలిసి ఈ ఏడాది 8వ దీపోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశాయి. బుధవారం సాయంత్రం సరయూ నది తీరంలో దీపోత్సవాన్ని ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి, ఆలయ ట్రస్టీలు, పలువురు ప్రముఖులు ప్రారంభించనున్నారు. అయోధ్యలో రోడ్లకు ఇరువైపులా వంతెనలు, ఫ్లైఓవర్ ఫిల్లర్లపై శ్రీరాముడి పెయింటింగ్స్, రామాయణం, అయోధ్య ఆలయ ముఖచిత్రాలు దర్శనమిస్తున్నాయి.
స్పెషల్ అట్రాక్షన్‌గా ‘రామ్ కీ పైడీ’
దీపోత్సవంలో దాదాపు 30 వేల మంది వాలంటీర్లు పాల్గొంటున్నారు. సరియూ తీరంలోని 55 ఘాట్ లతో పాటు ఆలయ ప్రాంగణంలో వీరు 28 లక్షల దీపాలను అలంకరిస్తున్నారు. 2 వేల మందికి పైగా సూపర్ వైజర్లు, కో–ఆర్డినేటర్లు, ఘాట్ ఇన్ చార్జ్ లు, సభ్యులు.. 37 ఇంటర్ కాలేజీలు, 14 ఇతర కాలేజీలు, 40 ఎన్జీవోల నుంచి వాలంటీర్లు పాల్గొంటున్నట్లు దీపోత్సవ ప్రోగ్రాం నోడల్ ఆఫీసర్ సంత్ శరణ్ మిశ్రా తెలిపారు.
ప్రతి దీపంలోనూ 30 మిల్లీలీటర్ల ఆవనూనెను నింపుతున్నట్టు చెప్పారు. ఇక ఈ మొత్తం కార్యక్రమంలో ‘రామ్ కీ పైడీ’లోని ఘాట్ నెంబర్ 10 స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. 80 వేల దీపాలతో భారీ అద్భుతమైన
స్వస్తిక్ చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకోసం150 మంది వాలంటీర్లను ఏర్పాటు చేశారు.
ఈ దీపావళి ప్రత్యేకం: మోదీ
దీపోత్సవం ఏటా రికార్డులు తానే బద్దలు కొడుతూ సాగుతోంది. ఎనిమిదేండ్ల కింద తొలిసారి సరయూ ఒడ్డున ఈ దీపోత్సవం జరిగింది. తొలిసారి 2017లో 1.71 లక్షల దీపాలు వెలిగించి రికార్డు సృష్టించారు. ఏటా దీపాల సంఖ్యను పెంచుతూ వస్తున్నారు. ఈ సారి ఏకంగా 28 లక్షల దీపాలతో అయోధ్య దేదీప్యమానంగా వెలిగిపోనుంది. బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన తర్వాత తొలి దీపావళి కావడంతో ఈసారి పండుగ ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
‘‘500 ఏండ్ల తర్వాత రాముడు అయోధ్య ఆలయంలో కొలువుదీరాడు. ఈ అద్భుత ఆలయంలో శ్రీరాముడు జరుపుకునే తొలి దీపావళి ఇది” అంటూ ట్వీట్ చేశారు. దీపోత్సవానికి సర్వం సిద్ధమైందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. లేజర్, సౌండ్, డ్రోన్ షోలకు ఏర్పాట్లు కూడా చేస్తున్నామని తెలిపారు.
ఈ వేడుకల్లో ప్రధాని, సీఎం, ప్రముఖులు పాల్గొంటున్న నేపథ్యంలో 150 మంది ఎన్ఎస్జీ కమెండోలు, యాంటీ టెర్రర్ స్క్వాడ్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ తోపాటు 5 వేల మంది బలగాలను కీలక ప్రాంతాల్లో అధికారులు మోహరించారు. సరయూ తీరంలో భద్రతను మరింత పెంచారు.
పాస్ లు ఉన్నవారిని మాత్రమే రామ్ కీ పైడీ, సరయూ ప్రాంగణం వద్దకు అనుమతించనున్నారు.