లక్నో: దీపావళి పండుగను పురస్కరించుకుని యూపీలోని అయోధ్యలో ఏర్పాటు చేసిన భవ్య దిపోత్సవ్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. భవ్య దిపోత్సవ్ వేడుకల సందర్భంగా అయోధ్య రామమందిరంలో 28లక్షల దివ్వెలు వెలిగించారు. సరయూ నది ఘాట్లో 1100 మంది హారతులు ఇచ్చారు. 28 లక్షల దివ్వెల వెలుగులతో భవ్య దిపోత్సవ్ గిన్సిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. లక్షలాదిమంది భక్తుల నడుమ అయోధ్య వీధుల్లో రామలక్ష్మణులు ఊరేగారు. ఈ రామలక్ష్మణుల ఊరేగింపు రథాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ లాగారు.
అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత జరిగిన మొదటి దీపోత్సవ్ వేడుకలను సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది మనం జరుపుకుంటున్న 8వ దీపోత్సవం అని గుర్తు చేశారు. ఇవాళ కాశీ వెలిగిపోతోందని.. ప్రపంచం మహా కాశీని చూస్తోందని.. ఇది మనందరికి ఎంతో గర్వకారణమని అన్నారు. ఎనిమిదేళ్ల క్రితం తొలి దీపోత్సవ వేడుకలు జరుపుకున్నప్పుడు.. అయోధ్యలో రామమందిరం నిర్మించాలని ప్రజలు కోరేవారు.
Also Read :- బాణాసంచాపై నిషేధం వెనక హిందూ–ముస్లింకోణం లేదు
వారు కోరుకున్నట్లుగానే మనం అయోధ్యలో రామమందిరం నిర్మించుకున్నామని పేర్కొన్నారు. హిందువుల ఏండ్ల నాటికల అయిన అయోధ్య రామమందిర నిర్మాణానికి శంఖుస్థాపన చేసినందుకు ప్రధాని మోడీకి ఈ సందర్భంగా యోగి కృతజ్ఞతలు తెలిపారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు పూర్తయ్యాయని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఇది డబుల్ ఇంజిన్ ప్రభుత్వమని.. ఏది చెబితే అదే చేస్తోందని అన్నారు. నేడు అయోధ్య రామమందిరంలో ప్రజలు వెలిగించే దివ్వెలు కేవలం దివ్వెలు మాత్రమే కాదని.. అవి సనాతన ధర్మ విశ్వాసమన్నారు.