హోమియో ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత

జిల్లాలో ఆయుష్​ సేవలు పూర్తి స్థాయిలో అందడం లేదు. ఆయుర్వేద, హోమియో, నేచరోపతి ట్రీట్​మెంట్ కు ఆదరణ పెరుగుతున్నప్పటికీ వైద్యులు, ఫార్మసిస్ట్, సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండడంతో వైద్యం అందని పరిస్థితి ఉంది. పోస్టుల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఆయుష్​ వైద్యం జనానికి అందడం లేదు. 

ఖాళీలే ఎక్కువ 
జిల్లాలో 30 ఆయుష్​ హాస్పిటల్స్​ ఉన్నాయి. 16 ఆయుర్వేద, 7 హోమియో, 6 యునానీ, ఒక నేచరోపతి హాస్పిటల్​ ఉన్నాయి.  వీటిల్లో 13 రెగ్యులర్​ డాక్టర్లు, ఫార్మసిస్ట్​లు, వైద్య సిబ్బందితో నడుస్తుండగా, 17హాస్పిటల్స్​ కాంట్రాక్ట్​ పద్ధతిలో నడుస్తున్నాయి. 13 రెగ్యులర్​ హాస్పిటల్స్​లలో ఐదుగురు డాక్టర్లు ఉండగా, ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. , ఐదుగురు కాంపౌండర్లు పని చేస్తుండగా, 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 11మంది అటెండర్లు పని చేస్తుండగా, మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 17 హాస్పిటల్స్ లో​ ఏడుగురు కాంట్రాక్ట్​ డాక్టర్లే పని చేస్తుండగా, 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 17 మంది కాంపౌడర్లకు గాను 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చుంచుపల్లి, ఆర్. కొత్తగూడెం,  జగన్నాథపురం, మణుగూరు, రొంపేడ్​ ఆయుర్వేద ఆసుపత్రుల్లో మెడికల్​ ఆఫీసర్​తో పాటు ఫార్మాసిస్ట్​ పోస్టులు ఖాళీగా ఉండడంతో రోగులను చూసే వారే లేరు. ఇల్లందు, చర్ల, పర్ణశాల, అశ్వారావుపేట హోమియో ఆసుపత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది పోస్టులన్నీ ఖాళీగా ఉండడంతో ఆ దవాఖానాలను తెరవడమే లేదు. 

ఆదరణ ఉన్నా పర్యవేక్షణ కరువు
భద్రాచలం, చండ్రుగొండ హోమియో ఆసుపత్రులకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ట్రీట్​మెంట్​ కోసం రోగులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. కొవిడ్​ తరువాత ఆయుర్వేద వైద్యానికి డిమాండ్​ పెరిగింది. దీర్ఘకాలిక రోగులు హోమియో వైపు దృష్టి పెడుతున్నారు. అయితే జిల్లాలోని ఆయుర్వేద, హోమియో హాస్పిటల్స్​కు డాక్టర్లు, వైద్య సిబ్బంది అవసరం మేర లేకపోవడంతో రోగులు ప్రైవేటు దవాఖానాలను ఆశ్రయిస్తున్నారు. ఆయుష్​ ఆసుపత్రులను వరంగల్​ ఆర్జేడీ కార్యాలయం నుంచే​పర్యవేక్షిస్తుంటారు. దీంతో జిల్లాలోని కొందరు డాక్టర్లు విధులు సక్రమంగా నిర్వహించడం లేదనే ఆరోపణలున్నాయి. ఇటీవల జరిగిన జడ్పీ స్టాండింగ్​ కమిటీ సమావేశాల్లో ఆయుష్​ హాస్పిటల్స్​ పనితీరుపై జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్యతో పాటు పలువురు జడ్పీటీసీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. 

హాస్పిటల్​ తెరిపించాలి
నేను, నా భార్య దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్నాం. ఖమ్మంలోని ప్రైవేట్​ హోమియో హాస్పిటల్​కు పోతే డాక్టర్​ ఫీజు, మందులకు కలిపి రూ.1,500 పైగా ఖర్చు అయింది. ఇల్లందులోని హోమియో హాస్పిటల్​ తెరవట్లేదు. ప్రైవేటుకు పోలేక భద్రాచలం గవర్నమెంట్​ హోమియో హాస్పిటల్​కు వెళ్లి ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నాను. ఇల్లందు హోమియో హాస్పిటల్​ను తెరిపించాలి.
- వేణుగోపాల్, ఇల్లందు