- జీహెచ్ఎంసీ పర్యవేక్షణలో కేంద్ర ప్రభుత్వ సర్వైలెన్స్ ఆఫీసు
- సికింద్రాబాద్ హరిహర కళాభవన్
- ఐదో అంతస్తులో ఏర్పాటు
- దీనిద్వారా స్లమ్ ఏరియాలో ముందస్తుగా వ్యాధుల గుర్తింపు
- డాక్టర్లు, సిబ్బందిని నియమించేందుకు కసరత్తు
హైదరాబాద్, వెలుగు: సిటీలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ ఫ్రాస్ర్టక్చర్ మిషన్ (పీఎం అభీమ్) యూనిట్ ఏర్పాటు కానుంది. ఇందుకు మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్(ఎంఎస్ యూ) పేరుతో ఆఫీసును త్వరలోనే ప్రారంభిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఆ యూనిట్ నిర్వహణను జీహెచ్ఎంసీకి అప్పగించింది. వ్యాధులను ముందస్తుగా గుర్తించడం, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదించడం యూనిట్ విధి. దేశవ్యాప్తంగా 20 మెట్రో సిటీల్లో పీఎం అభీమ్ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించింది.
ఇప్పటికే 11 సిటీల్లో అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం సిటీలో ఏర్పాటు చేసేది 12వ కానుంది. దీని హెడ్ ఆఫీసుని సికింద్రాబాద్ హరిహరకళభవన్ లోని ఐదో అంతస్తులో ఏర్పాటు చేస్తుండగా.. 3 నెలల్లో పనులను పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది. రెండు రోజుల కిందట కేంద్రం నుంచి వైద్యాధికారులు డాక్టర్ హిమాన్ష్, డాక్టర్ ప్రణయ్ లు వచ్చి బల్దియా ఇన్ చార్జ్ కమిషనర్ అమ్రపాలితో సమావేశం అయ్యారు.
యూనిట్ హెడ్ గా కమిషనర్
మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్ కు హెడ్ గా బల్దియా కమిషనర్ ఉంటారు. యూనిట్ ను చీఫ్ మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షిస్తారు. ఇందుకు ప్రత్యేకంగా నలుగురు పబ్లిక్ హెల్త్ డాక్టర్లను నియమిస్తారు. వీరితో పాటు బల్దియా 30 సర్కిళ్లలోని మెడికల్ ఆఫీసర్లు రెగ్యులర్ గా పనులపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది. వీరితో పాటు మరో 42 మంది సిబ్బంది ఉంటారు. ఇందులో ల్యాబ్ టెక్నిషియన్లు, మైక్రోబయాలజీ, పథాలజీ, ల్యాబ్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, నెట్ వర్క్ మేనేజర్ ఇతర స్టాఫ్ ఉండనుంది. ఇప్పటికే ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది.
రెగ్యులర్గా శాంపిల్స్ .. టెస్టులు
గ్రేటర్ సిటీలోని 5 వేల కాలనీల్లో ప్రజల హెల్త్ స్టేటస్ ఎప్పటికప్పుడు తెలిపేందుకు ఈఎంఎస్ యూ ఎంతో ఉపయోగపడనుంది. మురికి వాడల్లో వ్యాధులు ఎక్కువగా ప్రబలే కాలనీల నుంచి రెగ్యులర్ గా శాంపిల్స్ సేకరించి టెస్ట్ లు చేస్తారు. బ్లడ్, యూరిన్ తో పాటు వాంతులు, విరోచనలు అయ్యే ప్రాంతాల్లో వాటర్ శాంపిల్స్ తో పాటు మిగతా ఏవైనా వ్యాధులకు కూడా సేకరిస్తారు.
వాటిని నారాయణగూడలోని ఐపీఎంకు పంపుతారు. అలాగే జెనెటిక్ టెస్టులను నిమ్స్ లో చేయిస్తారు. ఫైనల్ రిపోర్టుల ఆధారంగా ఆయా ప్రాంతాల్లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు రిపోర్టు చేస్తారు.మొత్తానికి ఆరోగ్య సమస్యలను ముందుగానే తెలియడంతో పాటు వెంటనే జాగ్రత్తలు తీసుకునేందుకు ఈఎంఎస్ యూ పని చేయనుంది.