
- రాష్ట్రంలో అందుబాటులోకి రానున్న కేంద్ర ప్రభుత్వ పథకం
- ఆధార్ కార్డులో 70 ఏండ్ల వయసు ఉంటే చాలు
- ఆరోగ్య శ్రీ, పీఎంజేఏవై ద్వారా లబ్ధిపొందుతున్నవారూ అర్హులే
హైదరాబాద్, వెలుగు: ఆయుష్మాన్ భారత్ వయో వందన స్కీమ్ ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో అమలులోకి రానుంది. ఈ పథకం ద్వారా70 ఏండ్లు పైబడిన వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా అందించనుంది. ఈ స్కీమ్ అమలుకు సంబంధించి రాష్ట్ర వైద్య, ఆరోగ్య అధికారులు నెట్ వర్క్ హాస్పిటల్స్ కు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక పరిమితులతో ఎలాంటి సంబంధం లేకుండా.. ఆధార్ కార్డులో ఉన్న వయసు ఆధారంగా కుటుంబంలోని వయోవృద్ధులు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం పొందవచ్చు.
ట్రీట్మెంట్, సర్జరీలు, హాస్పిటాలిటీ, మెడిసిన్ ఖర్చులన్నీ కలిపి రూ. 5 లక్షల దాకా ఫ్రీగా అందుతాయి. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సీజీహెచ్‌ఎస్) లేదా ఇతర ప్రభుత్వ హెల్త్ స్కీమ్‌ల ద్వారా ప్రయోజనం పొందుతున్న వారు సైతం ఆయుష్మాన్ వయో వందనకు అర్హులే. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నవారు ఈ స్కీమ్ కింద కూడా ప్రయోజనం పొందొచ్చు. ఆయుష్మాన్ వయో వందన పథకాన్ని దేశంలో చాలా రాష్ట్రాలు ఇప్పటికే అమలు చేస్తున్నాయి. ఏప్రిల్ 1నుంచి మన రాష్ట్రంలో కూడా అమలులోకి రానుంది.
వయసు ఒక్కటే ప్రామాణికం..
ఈ స్కీమ్ కు వయసు ఒక్కటే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. 70 ఏండ్లు పైబడిన సీనియర్ సిటిజన్స్ ఆయుష్మాన్ భారత్ వయో వందన కార్డు పొందడానికి అర్హులు. ఈ కార్డులను పొందాలంటే beneficiary.nha. gov.in ద్వారా లేదా ఆయుష్మాన్ మొబైల్ యాప్ ద్వారాఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే నెట్ వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్య మిత్ర సిబ్బందికి ఆధార్ కార్డు వివరాలు అందిస్తే రిజిస్టర్ చేసి కార్డును అందిస్తారు. పీఎంజేఏవై కింద కేవలం ఆర్థికంగా వెనుకబడిన వారికి మాత్రమే ఇన్సూరెన్స్ కవరేజ్ పొందడానికి వీలుండగా, ఆయుష్మాన్ భారత్ వయో వందన స్కీమ్ ద్వారా 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారు ఎవరైనా ప్రయోజనం పొందొచ్చు.
ఆయుష్మాన్ భారత్ లో 416 నెట్ వర్క్ హాస్పిటల్స్..
ఆయుష్మాన్ వయో వందన కార్డులు ఉన్నవారు ప్రభుత్వ హాస్పిటల్స్, ఎమ్ ప్యానెట్ అయి ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఫ్రీగా చికిత్స పొందొచ్చు. ఇప్పటికే ఉన్న రోగాలకు కూడా చికిత్స పొందొచ్చు. డయాబెటిస్, హైపర్ టెన్షన్ వంటి తీవ్రమైన రోగాలకూ ఈ స్కీమ్ ద్వారా ట్రీట్‌మెంట్ తీసుకోవచ్చు. రాష్ట్రంలో 416 ప్రైవేట్ హాస్పిటల్స్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ తో ఎమ్ ప్యానెల్ అయి ఉన్నాయి. ఈ హాస్పిటల్స్ లో వయో వందన కార్డు కలిగిన వారు వైద్య సేవలను పొందవచ్చు.
ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 66 ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 49, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 47 హాస్పిటల్స్ నెట్ వర్క్ లో ఉన్నాయి. రాష్ట్రం మొత్తంగా 1017 ప్రభుత్వ హాస్పిటల్స్ లో కూడా ఈ సేవలను సీనియర్ సిటిజన్స్ పొందవచ్చు.