ఫ్రీ ట్రీట్​మెంటే.. ఆయుష్మాన్​ భవ!

ప్రజల ఆరోగ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పట్టింపు లేని అంశాల జాబితాలో చేర్చేసింది. కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి.. కనికరం లేనట్లుగా రాజకీయం చేస్తోంది. జనం చనిపోతుంటే.. అయ్యో పాపం.. ఆదుకోవాలి.. అనే సోయి లేకుండా కళ్లప్పగించి చూస్తోంది.

కరోనా ఫస్ట్ వేవ్​ నుంచి మెల్లమెల్లగా కోలుకుంటున్న ప్రజలను సెకండ్​ వేవ్ దారుణంగా​ చిదిమేసింది. ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్​తో పాటు పల్లెపల్లెనా విషాదమే తాండవిస్తోంది. ఇంతటి విషాదాన్ని, విపత్తును దాచిపెట్టి సాధించేదేమీ లేదు. చితి పేర్చేందుకు ఖాళీ లేని విధంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా స్మశానాలు నిండిపోతున్నాయి. కాడు కాల్చేందుకు కట్టెలకు కొరత వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకుంది. ఏకంగా ఫారెస్ట్ కార్పొరేషన్​ వెయ్యి టన్నుల కట్టెలు ఫ్రీగా సప్లై చేసింది. అంతటి ఔదార్యమున్న రాష్ట్ర సర్కారు.. ముందే జనాన్ని బతికించేందుకు ప్రయత్నం చేయాలి కదా! ప్రజల ప్రాణాల కంటే విలువైనదేముంది. బతికి ఉంటే బలుసాకైనా తినొచ్చు అని నిరుడు సీఎం కేసీఆర్​ కొట్టిన​ డైలాగులు ఇంత తొందరగా మరిచిపోయారా? కరోనా కేసులు, మరణాలు దాచిపెడితే దాగేవి కావని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది.

ప్రైవేటు దోపిడీపై ఎందుకు మౌనం
రాష్ట్రంలో కరోనా ట్రీట్​మెంట్ చాలా కాస్ట్​లీగా మారింది. ప్రైవేటు, కార్పొరేట్​ హాస్పిటళ్లు పేషెంట్లను ఇష్టానుసారం దోచుకుంటున్నాయి. తమ ఆస్పత్రిలో అసలు బెడ్లు ఖాళీ లేవని చెప్పి.. ప్రాణ భయంతో కొట్టుమిట్టాడుతున్న పేషెంట్ల నుంచి లక్షలకులక్షలు గుంజుతున్నాయి. ఆక్సిజన్​ తెచ్చుకోండి.. ఇంజక్షన్లు మీరే తెచ్చుకోండి.. దిక్కున్న చోట చెప్పుకోండి.. అంటూ బరితెగించి దోచుకుంటున్నాయి. ఒక్కో స్పెషలిస్టు డాక్టర్​ ఫీజు కింద రూ.5 వేలు.. కరోనా బెడ్​కు రోజుకు రూ.25 వేల నుంచి రూ.35 వేలు.. రోజుకు సగటున లక్షకుపైగా వసూలు చేస్తున్నాయి. డెడ్​బాడీలను కూడా పూర్తి ఫీజులు చెల్లించకుంటే వదిలి పెట్టడం లేదు. వీటికి సంబంధించి ప్రతిరోజు మెడికల్​ అండ్​ హెల్త్ డిపార్ట్​మెంట్​ కాల్​ సెంటర్​కు వేలాది ఫిర్యాదులు వస్తున్నాయి. ఇవన్నీ మీకు తెలిసినా.. జనం మీ దృష్టికి తెచ్చినా ఎందుకు పట్టించుకోవటం లేదు? కార్పొరేట్​ హాస్పిటళ్లపై మీకున్న ప్రేమ అటువంటిది. ప్రైవేటు హాస్పిటళ్లను కంట్రోల్​ చేసి ఫీజులను కట్టడి చేసే చర్యలపై వెనుకడుగు వేయటంలో రహస్యమేమిటి? ఫస్ట్ వేవ్​లో ప్రైవేటు హాస్పిటళ్ల ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన 248 జీవో.. ఇప్పుడు ఎందుకు అమలు కావడంలేదు? రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్పిటళ్లలో బెడ్లు ఖాళీ ఉన్నాయా? లేదా? అనే విషయానికి సంబంధించి డిస్​ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలి. ఐఏఎస్, ఐపీఎస్​ ఆఫీసర్ల సూపర్​విజన్​తో ప్రైవేటు హాస్పిటళ్ల దోపిడీని అరికట్టాలి. అప్పటికీ దోపిడీ ఆగకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ప్రైవేటు హాస్పిటళ్లను అధీనంలోకి తీసుకుని కఠినమైన చట్టాలు ప్రయోగించాలి. వీటన్నింటికీ మించి పేదలకు కరోనా ట్రీట్​మెంట్​ఫ్రీగా అందించాలి. జనం కోరుకుంటున్న ఈ డిమాండ్లన్నీ అమలు కావాలంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర నుంచి మేలుకోవాలి.

ఆయుష్మాన్​లో చేరండి.. ఆరోగ్యశ్రీలో చేర్చండి
8 నెలల కిందట కరోనా ట్రీట్​మెంట్​ను ఆరోగ్యశ్రీలో చేరుస్తామన్న కేసీఆర్ ​ప్రకటించారు. మళ్లీ ఆ మాటెత్తటం లేదు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్​ భారత్​లో కరోనాకు ఫ్రీ ట్రీట్​మెంట్​ అందుబాటులో ఉంది. ఇతర జబ్బులకు కూడా రూ.ఐదు లక్షల వరకూ కవరేజీ ఉంది. ఆయుష్మాన్ స్కీమ్​ అమలు చేస్తే ప్రైవేట్ హాస్పిటళ్ల బిల్లుల దోపిడీ నుంచి పేదలు, మిడిల్​ క్లాస్​ వాళ్లందరికీ మేలు జరుగుతుంది. నిరుడు కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లోనూ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్​ సెక్రటరీ ఆయుష్మాన్​ ​లో చేరుతున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకూ చేరలేదు. దీంతో ఎవరికి లాభం జరిగింది? కరోనా ట్రీట్​మెంట్ల కోసం అందిన కాడికి అప్పులు చేసి నిట్టనిలువునా నిరుపేదల కుటుంబాలు అప్పుల పాలయ్యాయి. ఎన్నో విలువైన ప్రాణాలు పోయాయి. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్​లో ఆయుష్మాన్​భారత్​తోపాటు ఆరోగ్యశ్రీలో కరోనా ట్రీట్​మెంట్​ ఫ్రీగా అందిస్తున్నారు. తెలంగాణలో ఎవరి ప్రయోజనాల కోసం జనంతో లక్షలు ఖర్చు పెట్టిస్తున్నారు. ఎన్ని కోట్లయినా ఖర్చు పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడతామని పదే పదే చెప్పే కేసీఆర్​.. ఇంతటి ఆపద వచ్చినప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? మీరిచ్చే రైతు బంధు, పంచుతున్న ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ కానుకలన్నీ పేదల సంక్షేమానికే కదా! ఇప్పుడు అంతకు వంద రెట్లు అప్పులు తెచ్చి నిరుపేద కుటుంబాలు హాస్పిటళ్ల ముందు బిక్కు బిక్కుమంటూ ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్నాయి. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి సార్​.. అని ఓ బాధితుడు మినిస్టర్​ కేటీఆర్​కు ట్వీట్​ చేస్తే.. నాన్నకు తెలియజేస్తా.. అని రిప్లై ఇచ్చారు. ఇప్పటికైనా ఈ విషయం మీకు చేరిందో లేదో.. డౌటే.

నిరుటి గొప్పలు ఉత్తవేనా!
ఇప్పటికే ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లు, కాంట్రాక్టర్లతో మీకున్న లోపాయికారీ ఒప్పందాలతో రాష్ట్రం అధోగతి పాలవుతోంది. ఇప్పుడు ప్రజల ఆరోగ్యానికి రక్షణ లేకుండా పోయింది. అటు ప్రైవేటుకు వెళ్లలేక, ఇటు సర్కారు వైద్యం అందక నిరుపేదలెందరో చనిపోతున్నారు. ఫస్ట్ వేవ్​లో ఎదురైన అనుభవాలతో గవర్నమెంట్​ హాస్పిటళ్లలో కరోనా ట్రీట్​మెంట్​కు అవసరమైన సౌలత్​లు కల్పించాలనే కనీస ముందుచూపు టీఆర్ఎస్​ ప్రభుత్వానికి కొరవడింది. నిరుడు కేంద్ర ప్రభుత్వం పంపించిన 1,400 వెంటిలేటర్లను సైతం ఇప్పటికీ హాస్పిటళ్లలో అమర్చలేదు. ఎందుకింత నెగ్లిజెన్సీ. ఇవన్నీ అందుబాటులోకి తెచ్చి ఉంటే కొందరైనా బతికి ఉండేవాళ్లు కదా. ఫస్ట్ వేవ్​లో కరోనా ట్రీట్​మెంట్​ కోసం ప్రత్యేకంగా ఢిల్లీ ఎయిమ్స్​ తరహాలో గచ్చిబౌలిలో టిమ్స్​ హాస్పిటల్​ను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం గొప్పలు చెప్పారు. ఇప్పుడు ఆ హాస్పిటల్​కు పేషెంట్లు వస్తుంటే.. గేట్లు మూసే పరిస్థితి ఎందుకు వచ్చింది. అంతటి సూపర్​ స్పెషాలిటీ సేవలందించే హాస్పిటల్​ అయితే ఒక్కసారన్నా సీఎం కేసీఆర్​ విజిట్​ చేశారా!
- డాక్టర్​ వివేక్​ వెంకటస్వామి, మాజీ ఎంపీ, బీజేపీ కోర్​ కమిటీ మెంబర్