నార్కట్‌పల్లి, వెలుగు : సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఏడాదిలోగా గోపలాయపల్లి వారిజాల వేణుగోపాలస్వామి గట్టుపై ఆయుత చండీయాగం చేయిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఈ యాగం నిర్వహించనున్నట్లు తెలిపారు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం వారిజాల వేణుగోపాలస్వామి ఆలయ గట్టుపై చైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సుదర్శనయాగ సహిత రుద్రయాగంలో మంత్రి పాల్గొని పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే మార్చి నాటికి బ్రాహ్మణ వెల్లంల, ఉదయ సముద్రం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామన్నారు. 16 ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్ఎల్బీసీ సొరంగం పనులు పూర్తి చేసేందుకు సీఎంతో మాట్లాడుతానని చెప్పారు. రూ. 2,200 కోట్లు మంజూరు చేయించడమే కాకుండా నిధుల విడుదలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రీన్ ఛానల్‌లో నిధులు ఏర్పాటు చేస్తామన్నారు. రైతు సంక్షేమ కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. గట్టుపైన రూ. 2 కోట్లతో అన్ని రకాల వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. చెరువుగట్టు దేవస్థానంపై 100 కాటేజీల నిర్మాణానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ – విజయవాడ రహదారిని ఆరు లేన్లుగా మార్చేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అంగీకరించారని, ఈ పనులకు వచ్చే నెలలో టెండర్లు పిలవనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో డీఎస్పీ శివరామిరెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, చిట్యాల మున్సిపల్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, మండల అధ్యక్షుడు బత్తుల ఊశయ్య గౌడ్ పాల్గొన్నారు.