స్పీకర్ గా అయ్యన్న... మరి రఘురామా..!

ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం చకచకా నిర్ణయాలు అమలు చేస్తూ పాలనాపరమైన ప్రక్షాళన దిశగా వేగంగా అడుగులేస్తోంది. చంద్రబాబు కేబినెట్ లో చోటు దక్కిన మంత్రులంతా ఒక్కొక్కరుగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో స్పీకర్ గా ఎవరికి ఛాన్స్ దక్కుతుంది అన్న అంశంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజుకు స్పీకర్ పదవి దక్కుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే, తాజాగా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడికి స్పీకర్ పదవి కేటాయించారని సమాచారం అందుతోంది.

డిప్యూటీ స్పీకర్ గా జనసేన ఎమ్మెల్యేను నియమించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. జనసేన ఎమ్మెల్యేలు లోకం మాధవి, పంతం నానాజీలలో ఒకరిని డిప్యూటీ స్పీకర్ గా నియమిస్తారని తెలుస్తోంది. దీనిపై జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సమాచారం. మరి,చాలా కాలంగా వినిపిస్తున్న రఘురామకు ఏ పదవి ఇస్తారన్న చర్చ మొదలైంది.

మంత్రివర్గంలో క్షత్రియ సామాజికవర్గానికి చోటు దక్కలేదు కాబట్టి, టీటీడీ ఛైర్మెన్ పదవిని ఈ సామజిక వర్గానికి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రేసులో అశోక్ గజపతిరాజు, రఘురామ పేర్లు వినిపిస్తున్నాయి.మరి, స్పీకర్ పదవిపై ఆశలు పెట్టుకున్న రఘురామకు చంద్రబాబు ఏ రకమైన న్యాయం చేస్తారో వేచి చూడాలి.