- తెలంగాణ, ఏపీ నుంచి వేలాది మంది హాజరు
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం అయ్యప్ప మాలధారుల ప్రత్యేక గిరిప్రదక్షిణ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది మాలధారులు పాల్గొన్నారు. తెలంగాణతో పాటు ఏపీ నుంచి కూడా అయ్యప్ప మాలధారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఉదయం 5.30 గంటలకు యాదగిరిగుట్టలోని వైకుంఠ ద్వారం వద్ద ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఈవో భాస్కర్‌రావు కలిసి అయ్యప్పస్వాముల గిరిప్రదక్షిణను ప్రారంభించారు. అంచనాకు మించి భారీ సంఖ్యలో మాలధారులు హాజరుకావడంతో యాదగిరిగుట్ట అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది.
గిరిప్రదక్షిణ అనంతరం మాలధారులు కొండపైకి వెళ్లి స్వయంభు నారసింహుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అయ్యప్ప మాలధారులకు యాదగిరిగుట్ట ఆఫీసర్లు ప్రత్యేక దర్శనం కల్పించి, స్వామి వారి ప్రసాదం అందజేశారు.