క్రికెటే కాదు బిజినెస్‌లోనూ సచిన్‌ రారాజే.. రూ.5 కోట్ల పెట్టుబడితో రూ.26 కోట్లు లాభం

క్రికెటే కాదు బిజినెస్‌లోనూ సచిన్‌ రారాజే.. రూ.5 కోట్ల పెట్టుబడితో రూ.26 కోట్లు లాభం

భారత మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ క్రికెట్‌లోనే కాదు బిజినెస్‌లో‌నూ తాను జీనియస్ అని నిరూపించారు. కేవలం రూ.5 కోట్ల పెట్టుబడితో రూ.26 కోట్లు లాభాన్ని ఆర్జించారు. అదెలా అంటారా! స్టాక్ మార్కెట్ ద్వారా. సచిన్ తొమ్మిది నెలల కిందట ఓ కంపెనీలో ఐదు కోట్లు పెట్టుబడి పెట్టగా.. ఆ మొత్తం ఇప్పుడు రూ.31.55 కోట్లకు చేరింది. 

రూ.5 కోట్ల పెట్టుబడి.. 

ఈ ఏడాది తొలి క్వార్ట్రర్‌లో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఆజాద్ ఇంజినీరింగ్ కంపెనీ ఐపీఓ ఇష్యూ జరగ్గా.. సచిన్ అందులో పెట్టుబడులు పెట్టారు. 2023, మార్చి 6న ఒక్కో ఈక్విటీ షేర్‌ ధర రూ.114.10 చొప్పున రూ.5 కోట్ల పెట్టుబడితో 4,38,210 షేర్లు కొనుగోలు చేశారు. నేడు(డిసెంబర్ 31) ఆ కంపెనీ షేర్‌ ధర నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి(NSE)లో రూ. 720 లిస్టింగ్ అవ్వడంతో సచిన్‌కు భారీ లాభాలు వచ్చాయి. ఒక్కో ఈక్విటీ షేర్‌ ధర రూ. 720 చొప్పున 4,38,210 షేర్ల విలువ రూ. 31.55 కోట్లకు పెరిగింది.

సచిన్‌ ఒక్కరే కాదు పలువురు క్రికెటర్లు, సినిమా యాక్టర్లు, సామాన్య ప్రజలు స్టాక్ మార్కెట్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఒకరకంగా ఇది కూడా జూదం వంటిదే. అదృష్టం తలుపుతడితే కోటీశ్వరులు అవ్వొచ్చు.. అదే తలకిందులైతే ఉన్నదీ పోయి పాతాళానికి పడిపోవచ్చు. స్టాక్ మార్కెట్‌పై అవగాహన, ఎలాంటి వాటిపై పెట్టుబడులు పెట్టాలి..? ఎప్పుడు క్రయవిక్రయాలు జరపాలి? అన్న దానిపై పూర్తి అవగాహన ఉంటేనే అందులోకి దిగాలి.