పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాటర్ అజామ్ ఖాన్ తొలిసారి టీ20 వరల్డ్ కప్ ప్రాబబుల్స్ లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. టీ20 లీగ్ ల్లో అదరగొట్టిన అజామ్ ఖాన్.. అంతర్జాతీయ క్రికెట్ లో ఘోరంగా విఫలమవుతున్నాడు. ప్లేయింగ్ 11 లో చోటు ఇచ్చినా వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేకపోతున్నాడు. వరుసగా రెండు సార్లు డకౌటై విమర్శల పాలవుతున్నారు. ఇంగ్లాండ్ తో సిరీస్ లో భాగంగా చివరి టీ20లో పరుగులేమీ చేయకపోగా.. వరల్డ్ తొలి మ్యాచ్ లో తొలి బంతికే ఔటయ్యాడు.
డల్లాస్ వేదికగా జరిగిన నిన్న (జూన్ 7) మ్యాచ్ లో యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్ లో షాదాబ్ ఖాన్ ఔట్ కావడంతో క్రీజ్ లో కి వచ్చిన అజామ్ ఖాన్.. తొలి బంతికే కెంజిగే బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఔటైన తర్వాత నిరాశగా పెవిలియన్ కు వెళ్తున్న ఈ పాక్ బ్యాటర్ ను ఒక అభిమాని ఘోరంగా అవమానించాడు. ‘మోటా హాతీ’(లావు ఏనుగు) అంటూ డైరెక్ట్‌గా అతని ముందే అనడంతో ఆజమ్ ఖాన్ తన కోపాన్ని నియంత్రించుకోలేకపోయాడు. అభిమానితో గొడవకు దిగడంతో అక్కడ కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొల్పింది.
ఇక మ్యాచ్ జరిగే సమయంలో స్టాండ్స్ లో ఒక అభిమాని "ఆజామ్ కాంట్ స్టాప్ ఈటింగ్" అని రాసి ఉన్న పేపర్ ను అందరికి చూపిస్తూ అజామ్ ను ట్రోల్ చేశాడు. ప్రస్తుతం ఈ రెండు సంఘటనలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఫిట్ నెస్ లేని అజామ్ ఖాన్ ను అసలు టీ20 వరల్డ్ కప్ కు ఎందుకు సెలక్ట్ చేశారని నెటిజన్స్ మండిపడుతున్నారు. మరోవైపు అజామ్ ఖాన్ ను ఇంతలా అవమానించడం కరెక్ట్ కాదని నెటిజన్స్ మద్దతు ఇస్తున్నారు. సూపర్ ఓవర్ లో ఫలితం వచ్చిన ఈ మ్యాచ్ లో అమెరికా 5 పరుగుల తేడాతో పాకిస్థాన్ కు షాక్ ఇచ్చింది.