2019 నకిలీ జనన ధ్రువీకరణ పత్రాల కేసులో సమాజ్‌వాది పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్‌తో పాటు ఆయన కొడుకు అబ్దుల్లా ఆజం, భార్య తంజీమ్ ఫాతిమాకు రాంపూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. జైలుశిక్షతో పాటు రూ.15వేల చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించిందని మాజీ డీజీసీ (క్రైమ్) సక్సేనా తెలిపారు.
"కోర్టు తీర్పు తర్వాత, ముగ్గురిని జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు నుంచి నేరుగా జైలుకు తరలిస్తారు" అని ప్రాసిక్యూషన్ తరపున వాదిస్తున్న మాజీ జిల్లా ప్రభుత్వ న్యాయవాది అరుణ్ ప్రకాష్ సక్సేనా అన్నారు. ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మేజిస్ట్రేట్ షోబిత్ బన్సల్ ముగ్గురు దోషులకు గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ కేసులో భారతీయ జనతా పార్టీ (బీజెపీ) ఎమ్మెల్యే ఆకాష్ సక్సేనా జనవరి 3, 2019లో రాంపూర్‌లోని గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు.
ఆజం ఖాన్, అతని భార్య తమ కుమారుడికి రెండు నకిలీ పుట్టిన తేదీ (DOB) సర్టిఫికేట్‌లను పొందడంలో సహాయం చేశారని ఆకాష్ సక్సేనా ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆజం భార్య తంజీమ్ ను సైతం ఈ కేసులో నిందితులుగా చేర్చారు. దీంతో వారిపై ఐపీసీ సెక్షన్ 420, 467, 468, 471 కింద అబ్దుల్లాతో పాటు తల్లిదండ్రుపై కేసు నమోదైంది. అయితే, అబ్దుల్లా తన సౌలభ్యం మేరకు ఎప్పటికప్పుడు రెండు బర్త్ సర్టిఫికెట్లను వినియోగిస్తున్నాడని ఎమ్మెల్యే ఆరోపించారు. చార్జిషీట్ ప్రకారం, రాంపూర్ మున్సిపాలిటీ జారీ చేసిన సర్టిఫికేట్‌లో, అబ్దుల్లా ఆజం పుట్టిన తేదీ జనవరి 1, 1993 అని, మరొక సర్టిఫికేట్ లో సెప్టెంబర్ 30, 1990న లక్నోలో జన్మించినట్లు ఉంది.
2022 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ టిక్కెట్‌పై సువార్ నియోజకవర్గం నుంచి గెలిచిన అబ్దుల్లా ఆజం, 2008లో ప్రభుత్వోద్యోగిపై తప్పుడు నిర్బంధం, దాడి కేసులో మొరాదాబాద్ కోర్టు ఇప్పటికే ఆయన్ను దోషిగా తేల్చింది, దీంతో అబ్దుల్లాకు రెండేళ్ల జైలు శిక్ష పడింది. ఈ శిక్ష అనంతం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సభ్యత్వాన్ని అబ్దుల్లా కోల్పోయిన అబ్దుల్లాకు.. ఈ కేసులో మధ్యంతర స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ఇటీవలే అనుమతిని నిరాకరించింది.
ALSO READ : సినిమా తుపాకీతో కుర్రోళ్ల బెదిరింపులు.. పట్టుకుని లోపలేసిన పోలీసులు
ప్రజాప్రాతినిధ్య చట్టం (RPA), 1951లోని నిబంధనల ప్రకారం, రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడిన ఎవరైనా అటువంటి నేరం రుజువైన తేదీ నుంచి అనర్హులు, జైలులో గడిపిన తర్వాత మరో ఆరు సంవత్సరాల పాటు అనర్హులుగా ఉంటారు.