ఫేక్​ బర్త్​ సర్టిఫికెట్ల ​కేసులో .. ఎస్పీ నేత ఆజం ఖాన్​కు ఏడేండ్ల జైలు శిక్ష

ఫేక్​ బర్త్​ సర్టిఫికెట్ల ​కేసులో  .. ఎస్పీ నేత ఆజం ఖాన్​కు ఏడేండ్ల జైలు శిక్ష

రాంపూర్: ఫేక్​ బర్త్​ సర్టిఫికెట్ల ​కేసులో ఉత్తరప్రదేశ్​కు చెందిన సమాజ్‌‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్, అతని భార్య తజీన్ ఫాతిమా, కొడుకు అబ్దుల్లా ఆజంకు ఏడేండ్ల జైలు శిక్ష పడింది. అబ్దుల్లా ఆజంకు రెండు బర్త్​సర్టిఫికెట్లు ఉన్నాయని.. ఒకటి లక్నో నుంచి, మరొకటి రాంపూర్ నుంచి తీసుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్​ సక్సేనా ఆరోపించారు. ఫేక్​సర్టిఫికెట్లు పొందడంలో తమ కుమారుడికి ఆజం ఖాన్ అతని భార్య సహాయం చేశారని పేర్కొంటూ జనవరి 3, 2019న రాంపూర్‌‌లోని గంజ్ పోలీస్ స్టేషన్‌‌లో ఆయన ఫిర్యాదు చేశారు. 

దీనిపై ఎంక్వైరీ చేసిన పోలీసులు.. లక్నోలో తీసుకున్న సర్టిఫికెట్​లో అబ్దుల్లా ఆజం పుట్టిన తేదీ సెప్టెంబర్ 30, 1990 అని ఉందని, రాంపూర్ మున్సిపాలిటీ జారీ చేసిన సర్టిఫికెట్‌‌లో జనవరి 1, 1993 అని ఉన్నట్టు చార్జ్​షీట్​లో పేర్కొన్నారు. విచారణ అనంతరం యూపీలోని ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు మెజిస్ట్రేట్ షోబిత్ బన్సాల్ ముగ్గురికి ఏడేండ్ల శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. కోర్టు తీర్పు తర్వాత, ఆ ముగ్గురినీ జ్యుడీషియల్ కస్టడీకి తీసుకున్నారని, వారిని కోర్టు నుంచే జైలుకు తరలిస్తారని ప్రాసిక్యూషన్ తరపున వాదించిన మాజీ జిల్లా ప్రభుత్వ అడ్వొకేట్​ అరుణ్ ప్రకాశ్​ సక్సేనా తెలిపారు.

 ఇదిలా ఉండగా.. అబ్దుల్లా ఆజం 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సువార్ నియోజకవర్గం నుంచి ఎస్పీ టికెట్‌‌పై గెలిచాడు. 2008లో ప్రభుత్వ ఉద్యోగిని నిర్బంధించి, దాడికి పాల్పడిన కేసులో ఈ ఏడాది ఫిబ్రవరిలో మొరాదాబాద్ కోర్టు దోషిగా నిర్ధారించి రెండేండ్ల జైలు శిక్ష విధించింది. శిక్ష పడిన రెండ్రోజుల తర్వాత అతడు​ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి అనర్హుడయ్యాడు.