అజారుద్దీన్పై ఈడీ ప్రశ్నల వర్షం.. 10 గంటల పాటు సాగిన విచారణ

అజారుద్దీన్పై ఈడీ ప్రశ్నల వర్షం.. 10 గంటల పాటు సాగిన విచారణ

హైదరాబాద్: మాజీ ఎంపీ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు (HCA) అజారుద్దీన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు సుదీర్ఘంగా విచారించారు. 10 గంటల పాటు అజారుద్దీన్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈడీ విచారణ అనంతరం అజారుద్దీన్ మాట్లాడుతూ.. తన మీద పెట్టిన కేసులన్నీ అక్రమ కేసులేనని చెప్పారు. హెచ్సీఏ కేసులోనే తనను ఈడీ విచారణకు పిలిచిందని, ఈడీ అధికారులకు తాను కోపరేట్ చేశానని తెలిపారు. తన మీద నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు అన్నీ అక్రమమేనని, కుట్రపూరితంగా తన మీద కేసులు పెట్టారని అజారుద్దీన్ మీడియాకు చెప్పారు. 

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) మాజీ అధ్యక్షుడు మొహమ్మద్‌‌ అజారుద్దీన్పై 2023, అక్టోబర్లో కేసు నమోదైంది. ఉప్పల్ స్టేడియంలో జిమ్, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్లు, క్రికెట్ బాల్స్, బకెట్ చైర్స్ కొనుగోళ్లలో నిధుల గోల్మాల్ జరిగిందని ఆరోపిస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సీఈవో సునీల్.. ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2020–23 మధ్య టెండర్ల కేటాయింపుల్లో కోట్లలో అవినీతి జరిగినట్లు ఫోరెన్సిక్ ఆడిట్‌లో తేలింది. ఈ క్రమంలో పర్చేజింగ్ ప్యానెల్లో ఉన్న అజారుద్దీన్, విజయానంద్​, సురేందర్ అగర్వాల్ తదితరులపై ఉప్పల్ పోలీసులు పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. 

ALSO READ | హైదరాబాద్‍లో ఫేక్ సర్టిఫికెట్ల కలకలం.. జిరాక్స్ షాప్‌లో పెట్టి అమ్ముతుండ్రు

మార్కెట్లో 392 రూపాయలు విలువ చేసే రెడ్​బాల్ను 1,400 రూపాయలకు, 420 రూపాయలు విలువ చేసే వైట్​టెస్ట్ బాల్ను 1,510 రూపాయలు పెట్టి కొన్నట్లు నిర్ధారణ అయింది. బాల్స్ కొనుగోళ్లలో మొత్తం రూ.57.07 లక్షల అవినీతి జరిగినట్లు స్పష్టమైంది. అదే విధంగా, రూ.177కే వచ్చే బకెట్ చైర్స్కు ఏకంగా రూ.2,568 పెట్టారు. ఇందులో మొత్తం రూ.43.11 లక్షల అవినీతి జరిగినట్లు తేలింది. అదే విధంగా, జిమ్ ఎక్విప్మెంట్ కొనుగోళ్లలో రూ.1.50 కోట్లు, ఫైర్ సేఫ్టీ ఎక్విప్​మెంట్ పర్చేజింగ్​లో రూ.1.34 కోట్ల అవినీతి జరిగినట్లు ఆడిట్లో తేలింది. ఈ కేసులోనే అజారుద్దీన్ను ఈడీ విచారించింది.