SL vs AFG: 55 పరుగులకే 5 వికెట్లు..భారీ సెంచరీలతో లంకను వణికించిన ఆఫ్ఘనిస్తాన్ వీరులు

భారీ లక్ష్య ఛేదనలో 55 పరుగులకే సగం జట్టు పెవిలియన్ కు చేరితే కోలుకోవడం కష్టం. అయితే మ్యాచ్ చేజారిపోతుందని తెలిసినా..ఆఫ్ఘనిస్తాన్ చివరి వరకు పోరాడింది. ఆ జట్టు బ్యాటర్లు ఓమార్జాయి, మహమ్మద్ నబీ భారీ సెంచరీలతో విరుచుకుపడి లంక బౌలర్లకు చుక్కలు చూపించారు. ఆరో వికెట్ కు ఏకంగా 242 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్ ను గెలిపించినంత పని చేశారు. 

పల్లెకెలె వేదికగా నిన్న శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య తొలి వన్డే జరిగింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక బ్యాటర్ నిశాంక డబుల్ సెంచరీ కొట్టినా..ఆఫ్గన్ బ్యాటర్లు అసాధారణ పోరాటం హైలెట్ గా నిలిచాయి. ఓమార్జాయి 115 బంతుల్లో 6 సిక్సులు, 13 ఫోర్లతో 149 పరుగులు చేసి అజేయంగా నిలిస్తే.. సీనియర్ బ్యాటర్ మహమ్మద్ నబీ 130 బంతుల్లో 3 సిక్సులు, 15 ఫోర్లతో 136 పరుగులు చేశాడు. 55 పరుగుల వద్ద 5వ వికెట్ పడితే 297 పరుగుల వద్ద ఆరో వికెట్ పడింది. లక్ష్యం మరీ భారీగా ఉండటంతో వీరి పోరాటానికి ఫలితం లేకుండా పోయింది. 

మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 383 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్‌‌ పాథుమ్‌‌ నిశాంక (139 బాల్స్‌‌లో 20 ఫోర్లు, 8 సిక్స్‌‌లతో 210 నాటౌట్‌‌) అరుదైన ఘనత సాధించాడు. లంక తరఫున వన్డేల్లో డబుల్‌‌ సెంచరీ సాధించిన తొలి ప్లేయర్‌‌గా రికార్డు సృష్టించాడు. ఛేజింగ్‌‌లో అఫ్గానిస్తాన్‌‌ 50 ఓవర్లలో 339/6 స్కోరుకే పరిమితమైంది. అజ్మతుల్లా ఒమర్‌‌జాయ్‌‌ (149 నాటౌట్‌‌), మహ్మద్‌‌ నబీ (136) సెంచరీలతో చెలరేగినా టీమ్‌‌ను గెలిపించలేకపోయారు. నిశాంకకు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.