హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల అమ్మకాలకు ఇక చెక్ పడనున్నది. ఆన్ లైన్ లో ‘బీ’ కేటగిరి సీట్ల కౌన్సెలింగ్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. కొత్త విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు చర్యలు ప్రారంభించింది. దీని కోసం తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (టీజీసీహెచ్ఈ) పలు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా 154 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు ఉండగా, వాటిలో లక్ష సీట్లు ఉన్నాయి. వీటిలో 70 శాతం సీట్లు కన్వీనర్ కోటాలో మెరిట్ ప్రకారం ఆన్లైన్లో భర్తీ చేస్తున్నారు. మిగిలిన 30 శాతం సీట్లను మేనేజ్మెంట్ కోటా (బీ కేటగిరి) కింద భర్తీ చేస్తున్నారు. అయితే.. బీ కేటగిరి సీట్లను మ్యానువల్‌గా భర్తీ చేస్తున్నారు. దీంతో నిబంధనలను పక్కన పెట్టి, ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికే సీట్లను అలాట్ చేస్తున్నారు.
బీ కేటగిరి పరిధిలో ఉండే ఎన్ఆర్ఐ కోటా సీట్లనూ ఇదే విధానంలో అమ్ముకుంటున్నారు. ఈఏపీ సెట్, జేఈఈ ర్యాంకుల ఆధారంగా బీ కేటగిరి సీట్లను నింపాల్సి ఉండగా, కొన్ని కాలేజీలు మాత్రం అడ్డగోలుగా సీట్లు అమ్ముకుంటున్నాయి. గత కొన్నేండ్లుగా ఇదే తంతు కొనసాగుతున్నా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులు బీ కేటగిరి సీట్లనూ ఆన్ లైన్లో నిర్వహించాలనే ప్రతిపాదనలనూ బీఆర్ఎస్ సర్కారు పక్కన పెట్టింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం క్వాలిటీ ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్‌పై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో బీ కేటగిరి సీట్లను కూడా స్ర్టీమ్ లైన్ చేయాలనే ఉద్దేశంతో ఆన్లైన్లో నిర్వహించాలని నిర్ణయించింది.
మూడు ప్రతిపాదనలు రెడీ
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే.. ఈ విద్యా సంవత్సరం ఇంజినీరింగ్ కాలేజీల్లో చేపట్టిన ఇంటర్నల్ స్లైడింగ్ విధానాన్ని ఆన్ లైన్లో నిర్వహించింది. తద్వారా అన్ని మేనేజ్మెంట్లకు హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే విద్యా సంవత్సరం మేనేజ్మెంట్ కోటా సీట్లనూ ఆన్ లైన్ విధానంలో మెరిట్ ఆధారంగానే భర్తీ చేయాలని డిసైడ్ అయింది. దీని కోసం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులు 3 ప్రతిపాదనలు రెడీ చేశారు. ఏపీలో విధానం, నీట్ విధానంతో తెలంగాణలో కొత్త విధానం రూపొందించారు.
ఏపీలో మాదిరిగా కన్వీనర్ కోటాలోని ఫీజును మేనేజ్మెంట్ కోటాలోని సీట్లకు రెండు, మూడు రెట్లుపెంచి ఇవ్వాలన్న ప్రతిపాదన ఉంది. దీని ప్రకారం సర్కారు నిర్ణయించిన ఫీజుతో పాటు రెండింతలు, మూడింతలు ఫీజుతో మరో రెండు సబ్ కేటగిరిలుగా సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ రెండు కాకుండా ప్రత్యేకంగా కన్వీనర్ కోటా మాదిరిగానే మేనేజ్మెంట్ కోటాకూ సర్కారు ఫీజు నిర్ణయించి ప్రభుత్వమే సీట్లను భర్తీ చేయడం. ఈ ప్రతిపాదనలు త్వరలోనే ప్రభుత్వానికి పంపించనున్నారు. దీంట్లో ఏదో ఒక ప్రతిపాదనను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం అమలు చేయనుంది. దీంతో ఇంజినీరింగ్ లో క్వాలిటీ పెరగుతుందని అధికారులు భావిస్తున్నారు.