పాలస్తీనాపై ఇజ్రాయిల్​ దాడులు ఆపాలి .. సీపీఐఎంఎల్​ ప్రజాపంథా నాయకుల డిమాండ్​

పాలస్తీనాపై ఇజ్రాయిల్​ దాడులు ఆపాలి .. సీపీఐఎంఎల్​ ప్రజాపంథా నాయకుల డిమాండ్​

ఆర్మూర్, వెలుగు: పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులను వెంటనే నిలిపివేయాలని సీపీఐఎంఎల్​ ప్రజాపంథా కార్యదర్శి వి.ప్రభాకర్, నాయకుడు బి.దేవరాం డిమాండ్​ చేశారు. బెంగుళూర్​ లో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సమావేశ తీర్మానాలను గురువారం ఆర్మూర్​లో వివరించారు. ఇజ్రాయిల్ తో భారత ప్రభుత్వం ఆయుధ వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకోవాలని,  స్వామినాథం కమిషన్ సిఫారసుకు చట్టబద్ధత కల్పించాలని,  రైతు కూలీలకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలని తీర్మానం చేశారని తెలిపారు. దేశవ్యాప్తంగా రుణమాఫీని అమలు చేయాలని, పరిశ్రమలకు ఇచ్చే అప్పులు తగ్గించి వ్యవసాయ రంగానికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

అధిక వడ్డీలు వసూలు చేసే ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలన్నారు. జన్యు మార్పిడి కారణంగా  పంజాబ్ లో  కేన్సర్ రోగులు ఎక్కువగా ఉన్నారని, రాబోయే రోజుల్లో తెలంగాణ ఆ జాబితాలో చేరే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.  ముందు జాగ్రత్తగా కేంద్ర ప్రభుత్వం దీనిని ఆమోదించకూడదని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీని అటకెక్కించి, మంత్రులు రోజుకొక ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. గత పంటల రైతు భరోసా, రాబోయే పంటలకు రైతు భరోసా ఒకేసారి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాయకులు సారా సురేశ్, ఆకుల గంగారం, యు.రాజన్న, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.