కారు బోల్తా పడి బీ ఫార్మసీ స్టూడెంట్ ​మృతి

  •     మరో నలుగురుకి తీవ్ర గాయాలు
  •     విహారయాత్రకు వెళ్లొస్తుండగా విషాదం

దేవరకొండ( నేరేడుగొమ్ము ),వెలుగు :  స్నేహితులంతా విహారయాత్రకు వెళ్లగా అది విషాదంతో ముగిసింది. నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం వైజాగ్ కాలనీ వద్ద గురువారం కారు బోల్తా పడిన ఘటనలో జి రాఘవేందర్ గౌడ్ (23) అనే  బీ ఫార్మసీ స్టూడెంట్​చనిపోయాడు. హైదరాబాద్ అబ్దుల్లాపూర్​మెట్​లోని బ్రిలియంట్ బీ ఫార్మసీ కాలేజీలో సెకండియర్​చదువుతున్న రాఘవేందర్ గౌడ్ , మరో 10 మంది ఫ్రెండ్స్​ రెండు కార్లలో హైదరాబాద్ ​నుంచి మంగళవారం వైజాగ్ కాలనీకి విహారయాత్రకు వచ్చారు.

బుధవారం మధ్యాహ్నం వరకు అక్కడే సరదాగా గడిపి భోజనం చేశారు. తర్వాత కార్లలో తిరిగి హైదరాబాద్​కు వస్తుండగా వైజాగ్ కాలనీ సమీపంలోని మూలమలుపు వద్ద రాఘవేందర్ గౌడ్ నడుపుతున్న కారు బోల్తా పడింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి స్వగ్రామం గద్వాల. ఇదే కారులో ప్రయాణిస్తున్న సంగారెడ్డి పట్టణానికి చెందిన ఎండీ సోహైల్, సుశీల్, హుజూర్​నగర్​కు చెందిన మహేశ్, కొత్తగూడానికి చెందిన కిరణ్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.