
- చున్నీతో ఉరి వేసుకున్న నరేశ్
- ఖమ్మం జిల్లాలో విషాదం
ఖమ్మం రూరల్, వెలుగు : ఖమ్మం జిల్లా రూరల్మండలంలోని బారుగూడెం పంచాయతీలోని వాయుపుత్ర నగర్ లో ఓ బీ ఫార్మసీ స్టూడెంట్ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం...నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన బల్మూరి నరేశ్(19) మండలంలోని బారుగూడెంలో మహ్మదీయ ఇంజినీరింగ్ కాలేజీలో బీఫార్మసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బారుగూడెంలోని వాయుపుత్రనగర్లో ఇల్లు రెంట్‌కు తీసుకుని స్నేహితులతో కలిసి ఉంటున్నారు. ఆదివారం రాత్రి అందరూ బిల్డింగ్ మీద పడుకున్నారు. సోమవారం ఉదయం నరేశ్ ఫ్రెండ్ ఒకరు నిద్ర లేచి చూసేసరికి నరేష్ బిల్డింగ్మెట్ల వద్ద స్టీల్ రాడ్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు.
పోలీసులకు సమాచారమివ్వగా వారు నరేశ్ తల్లిదండ్రులకు చెప్పారు. వారు తాము వచ్చే వరకు డెడ్‌బాడీ కదిలించొద్దని చెప్పడంతో సాయంత్రం వరకు వేచి చూశారు. వారు వచ్చిన తర్వాత బాడీని పోస్టుమార్టం కోసం ఖమ్మంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. నరేశ్ కొద్దికాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడని, ఆ యువతి నరేష్‌ను ప్రేమించకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి తండ్రి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటకృష్ణ తెలిపారు.