అంబేద్కర్ అందరివాడు 

అంబేద్కర్ అందరివాడు 

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్​ బీఆర్ అంబేద్కర్​ను కొన్ని వర్గాలకే పరిమితం చేస్తూ చూడటం అవగాహనా రాహిత్యమే కాదు బాధాకరమైన విషయం. దేశంలోని మెజారిటీ ప్రజలకు అంబేద్కర్​ గురించి అవగాహన లేకపోవడం వల్లే ఆయనను కొన్ని వర్గాల ప్రతినిధిగా చూస్తున్నారు. అంబేద్కర్ అంటే రాజ్యాంగం రాశారు, వీధి దీపాల కింద చదువుకున్నారు, అంటరానితనంతో అవమానాల పాలయ్యారు.. దళిత, గిరిజనులకు విద్య, ఉద్యోగాలు, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించారని మనలో చాలా మందికి తెలుసు. కానీ అంబేద్కర్​ అందరివాడనే విషయం తెలియాలంటే దేశంలోని వివిధ వర్గాల విముక్తి కోసం ఆయన చేసిన పోరాటాలను తెలుసుకుంటేనే అర్థమవుతుంది.

ప్రపంచమంతా వర్గ అసమానతలు ఉంటే మనదేశంలో వర్గ అసమానతలతోపాటు కుల అసమానతలు కూడా ఉన్నాయి. నిజం చెప్పాలంటే కుల అసమానతల వల్లే వర్గ అసమానతలు ఏర్పడ్డాయి. మనదేశం కన్నా ఘోరమైన అసమానతలు, అణచివేత, బానిసత్వం ఉన్న దేశాలు కూడా వాటి నుంచి విముక్తి పొందాయి. కానీ మనదేశంలో బానిసత్వం నుంచి ఇప్పటికీ విముక్తి దొరకడం లేదు. మనదేశ బానిసత్వంలో కులం ఇమిడి ఉందని, కుల నిర్మూలన జరగకుండా బానిసత్వం పోదని సూత్రీకరించిన అతి కొద్దిమంది మహానుభావుల్లో అంబేద్కర్ ఒకరు. స్వాతంత్ర్య పోరాటంతో పాటు దేశంలోని మెజారిటీ ప్రజల విముక్తి కోసం పోరాటం సాగించారు అంబేద్కర్. స్వాతంత్ర్యానికి పూర్వం దేశంలోని బహుజన ప్రజల హక్కుల కోసం,  అంటరానితనం నిర్మూలన, కుల నిర్మూలన కోసం పోరాటం చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో బహుజన ప్రజలు కలిసి రావాలంటే వారికి హక్కులు దక్కాలంటూ నిలదీసి ఎన్నో హక్కులను సాధించిన యోధుడు అంబేద్కర్. అందుకే ఆయన కొన్ని వర్గాలకు చెందిన వారు కాదు. అందరివాడు.

అందరికీ ఓటు హక్కు ప్రదాత
స్వాతంత్ర్యానికి పూర్వం అందరికీ ఓటు హక్కు ఉండేది కాదు. ప్రభుత్వానికి పన్ను చెల్లించే వాళ్లు, మెట్రిక్యులేషన్(10 వ తరగతి) చదివిన వారికి మాత్రమే ఓటు హక్కు ఉండేది. వేల ఏండ్ల నుంచి విద్యకు దూరమైన బహుజన ప్రజలు, స్త్రీలకు ఓటు హక్కు లేని ఆ కాలంలో దేశంలో ప్రతి మనిషికి ఒకటే విలువ ఉండాలని అందరికీ ఓటు హక్కు కల్పించాలని(వన్ మాన్ వన్ వాల్యూ) బ్రిటిష్ వారితో పోరాడి అందరికీ ఓటు హక్కు కల్పించారు అంబేద్కర్. యుద్ధాల్లో నెత్తురు పారించి సాధించే విజయానికన్నా, ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా ఓటుతో ఎక్కువ విజయాలను సాధించవచ్చని, తరతరాలుగా అణచివేయబడ్డ బహుజన వర్గాల విముక్తి ఓటు హక్కుతోనే సాధ్యమన్న అంబేద్కర్ ఆలోచనలు నేడు ఫలిస్తున్నాయి. ఓటు ఎంత విలువైనదో, ఎంత బలమైన ఆయుధమో ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక స్పష్టం చేసింది. డబ్బు, అధికార బలం, ప్రలోభాలతో ఓటర్లను కొనవచ్చన్నట్టు వ్యవహరించిన సీఎం కేసీఆర్​ను నెత్తురు చిమ్మకుండా ప్రజలు ఓటు ద్వారా ఓడించారు. కేసీఆర్ లాంటి నాయకులు, టీఆర్ఎస్ లాంటి పార్టీలను ఎదుర్కోలేని బలహీన వర్గాల ప్రజలకు అంబేద్కర్ కల్పించిన ఓటు ఆయుధమే అండగా నిలుస్తోంది.

అంబేద్కర్ ను మించిన త్యాగశీలి లేరు
‘త్యాగం మరింత త్యాగం.. పోరాటం మరింత పోరాటం’ అదొక్కటే మనల్ని విముక్తి చేస్తుందని అంబేద్కర్ ఆచరణాత్మక ఉద్యమం చేశారు. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం చేసే అవకాశం ఉన్నా.. పీడిత వర్గాల విముక్తి, అణగారిన వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. తన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలిసినా కూడా అణగారిన వర్గాల విముక్తి కోసమే తన ప్రయాణం కొనసాగించి త్యాగధనుడయ్యారు. హక్కులు, అధికారమే కాకుండా జీవన విధానం గురించి కూడా లోతుగా ఆలోచించిన అంబేద్కర్ ‘నేను హిందువుగా పుట్టాను. పుట్టుక నా చేతిలో లేదు. కానీ హిందువుగా మరణించను’ అని చెప్పి బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు. స్వేచ్ఛ, సోదరభావం, సమానత్వం కలిగిన బౌద్ధ ధర్మాన్ని ఐదు లక్షల మందితో నాగపూర్ లో స్వీకరించడమే కాకుండా మూలవాసి ప్రజలంతా బౌద్ధ ధర్మాన్ని స్వీకరిస్తేనే బహుజనుల బానిస సంకెళ్లు తొలగిపోతాయని పిలుపునిచ్చారు. అంబేద్కర్ పుట్టిన రోజైన ఏప్రిల్ 14న జయంతి వేడుకలు చేసుకునే అంబేద్కర్ వాదులు.. ఆయన బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన అక్టోబర్ 14ను మాత్రం పట్టించుకోనందునే బహుజనులు మత బానిసత్వం నుంచి బయటకు రాలేకపోతున్నారు.

మహిళా పక్షపాతి
మహాత్మా జ్యోతిబా పూలే చనిపోయిన ఏడాది తర్వాత పుట్టిన అంబేద్కర్.. పూలేను గురువుగా భావించి ఆయన చూపిన బాటలో బహుజనులు, మహిళల విద్యాభివృద్ధికి కృషి చేశారు. దేశంలో సగభాగమైన మహిళలకు విద్య, ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన అంబేద్కర్.. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కావాలని హిందూ కోడ్ బిల్లు పెడితే అప్పటి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. అందుకు నిరసనగా మంత్రి పదవికి రాజీనామా చేసి మహిళా పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారు. అటవీ ప్రాంతాలకు పరిమితమైన ఆదివాసీల హక్కులను కాపాడటానికి, వారి ప్రాంతాల్లో ఆదివాసీయేతరులు చొరబడకూడదని రాజ్యాంగంలోని షెడ్యూల్ 5 ద్వారా రక్షణ కల్పించారు. దేశంలో కుప్పలుగా వెలసిన అంబేద్కర్ సంఘాలు, ఉద్యోగ సంఘాలు అంబేద్కర్ చూపిన పే బ్యాక్ టు సొసైటీ అనే మార్గాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దళితులకే పరిమితమైన అంబేద్కర్ సంఘాలు ఇప్పటికైనా అంబేద్కర్ అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారని ఆయన అందరివాడని గుర్తించి అన్ని వర్గాల వారితో సంఘాలు ఏర్పాటు చేయాలి. 

బీసీ లెక్కల కోసం పోరాడాలి
ఓట్లు మావి సీట్లు మీవా? స్వాతంత్ర్య పోరాటం నుంచి మొదలుకొని ప్రతి ఉద్యమంలో మేమే ముందున్నాం అయినా మేమంటే లెక్క లేదా అంటూ బీసీలంతా కదం తొక్కాల్సిన సమయం వచ్చింది. అన్ని రంగాల్లో మేమెంత మందిమో మాకంత వాటా కావాలని నినదించాలి. అడవుల్లో తిరిగే పులుల లెక్కలు తీసే ప్రభుత్వాలు.. సమాజంలోని బీసీల లెక్కలు ఎందుకు తీయడం లేదు. దేశ జనాభాలో 60 శాతంగా ఉన్న బీసీల లెక్కలు బయటపడితే ఈ దోపిడీ పాలకుల పునాదులు కదులుతాయని భయపడుతున్నారు. బీసీల జనాభా లెక్కలు తీసినా తీయకున్నా ఎస్సీ, ఎస్టీలకు నష్టం ఏమీ లేదు. రాజకీయ, సామాజిక రంగాల్లో వారి వాటా వారికి ఉన్నందున వారు బీసీ జనాభా లెక్కలను పట్టించుకోవడం లేదు. బీసీ జనాభా లెక్కలు తేలితే ఆధిపత్య కులాలు అక్రమంగా అనుభవించే అవకాశాలు పోతాయనే ఆధిపత్య రాజకీయ పార్టీలు అడ్డుపడుతున్నాయి. తరతరాలుగా మానవాళి మనుగడకు, అభివృద్ధికి ఎనలేని సేవ చేస్తున్న బీసీలంటే లెక్క లేకుండా పోయింది. బీసీల లెక్కలు తీయరు కానీ బీసీల ఓట్లు మాత్రం ఈ పాలకులకు కావాలా? ఇప్పటికైనా కళ్లు తెరవాలి. బీసీల లెక్కలు తీయని పాలకవర్గాలకు ఓట్లు వేయడం బీసీల తప్పే అవుతుంది. ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి, మానవాళి మనుగడకు చెమటోడ్చిన బీసీలు అధికారానికి, అభివృద్ధికి ఆమడదూరంలో ఉండిపోయారు. ఆత్మగౌరవం లేకుండా జీవిస్తున్నారు. అంబేద్కర్ స్ఫూర్తిగా బీసీ జనాభా లెక్కల ఉద్యమం, ఆత్మగౌరవ, రాజ్యాధికార ఉద్యమం జరగాలి. పార్టీలు, సంఘాలు, ప్రాంతాలకు అతీతంగా ఉద్యమించాలి.

రాజ్యాధికారానికి పార్టీ కావాలి
అణగారిన వర్గాల ప్రజలు రాజ్యమేలిన నాడే బహుజనుల విముక్తి జరుగుతుందని, ఓటు హక్కు రాగానే సరిపోదని, ఆ ఓటు ద్వారా మనం రాజ్యం ఏలాలని, అందుకోసం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పేరుతో రాజకీయ పార్టీని అంబేద్కర్​ ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసిన అంబేద్కర్ ను అగ్ర కులాల నాయకులు ఓడించారు. ముస్లింలు ఈ దేశ మూలవాసులేనని, శూద్రులకు, ముస్లింలకు రక్త సంబంధాలు ఉన్నాయని అంబేద్కర్​ చేసిన బోధనల వల్లే వారు ఆయనకు దగ్గరయ్యారు. రాజ్యాధికారమే మన మాస్టర్ కీ అని అంబేద్కర్ బోధిస్తే.. నేడు బహుజన ప్రజలు ఆ మాస్టర్ కీ ని అగ్రవర్ణాల చేతికే ఇచ్చి పాలించమంటున్నారు. ఏ బానిసత్వం వీడాలని అంబేద్కర్ చెప్పాడో మనవాళ్లు అదే బానిసత్వం కొనసాగిస్తూ ప్రజాస్వామిక బానిసత్వంలో మునిగి దోపిడీ వర్గాలనే పాలకులుగా గెలిపిస్తున్నారు.

విముక్తి పోరాటం కొనసాగాలె
అంబేద్కర్ చూపిన బౌద్ధ ధర్మాన్ని పాటించడంతో పాటు జనవరి ఒకటిన బీమా కోరేగావ్ వద్ద మూలవాసి ప్రజలు పీష్వా బ్రాహ్మణ సైన్యాన్ని ఓడించిన రోజును బహుజన ప్రజలు శౌర్య దివస్ గా జరుపుకోవాలి. దేశ మూలవాసులను హీనంగా చూసి, వారి అణచివేతకు కారణమైన మనుధర్మ శాస్త్రాన్ని 1927 డిసెంబర్ 25న అంబేద్కర్ మొట్టమొదటిసారిగా తగులబెట్టారు. దానిని స్ఫూర్తిగా తీసుకుని డిసెంబర్​ 25న ఏటా మనుధర్మ శాస్త్రం తగలబెట్టి బహుజన ప్రజలను చైతన్యవంతులను చేయాలి. లేదంటే మనుధర్మాన్ని పోలిన రాజ్యాంగాన్ని మన పాలకులు ముందుకు తెచ్చే ప్రమాదం ఉంది. వీటిని నిర్వహించాల్సిన బాధ్యత అంబేద్కర్​ వాదులు, బహుజన సంఘాలు, ఉద్యోగ సంఘాలపై ఉంది. దళితులు, బీసీలు, మహిళా హక్కులు, ఆదివాసీల హక్కులు, అందరికీ ఓటు హక్కు ఇలా అన్ని వర్గాల కోసం పోరాడి ఎన్నో హక్కులు సాధించిన  అంబేద్కర్ అందరివాడని ఇప్పటికైనా గుర్తించాలి. ఆయన ఆశయాలను అర్థం చేసుకుని ఐకమత్యంతో ముందుకెళ్లి బహుజనుల విముక్తి కోసం పోరాడాలి.

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్​ బీఆర్ అంబేద్కర్​ను కొన్ని వర్గాలకే పరిమితం చేస్తూ చూడటం అవగాహనా రాహిత్యమే కాదు బాధాకరమైన విషయం. దేశంలోని మెజారిటీ ప్రజలకు అంబేద్కర్​ గురించి అవగాహన లేకపోవడం వల్లే ఆయనను కొన్ని వర్గాల ప్రతినిధిగా చూస్తున్నారు. అంబేద్కర్ అంటే రాజ్యాంగం రాశారు, వీధి దీపాల కింద చదువుకున్నారు, అంటరానితనంతో అవమానాల పాలయ్యారు.. దళిత, గిరిజనులకు విద్య, ఉద్యోగాలు, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించారని మనలో చాలా మందికి తెలుసు. కానీ అంబేద్కర్​ అందరివాడనే విషయం తెలియాలంటే దేశంలోని వివిధ వర్గాల విముక్తి కోసం ఆయన చేసిన పోరాటాలను తెలుసుకుంటేనే అర్థమవుతుంది.

ఐదేండ్లయినా అంబేద్కర్​ విగ్రహం పెట్టలె
చిన్న రాష్ట్రాల వల్ల అధికార వికేంద్రీకరణ జరిగి అణగారిన వర్గాల అభివృద్ధికి బాటలు పడతాయని అంబేద్కర్ భావించారు. ఆయన రూపొందించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ ఏర్పడింది. అలా ఏర్పడిన తెలంగాణలో దళితుడినే తొలి ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించిన కేసీఆర్.. ఆ విషయాన్ని పక్కకు నెట్టడమే కాకుండా ఉన్న ఒక్క దళిత ఉప ముఖ్యమంత్రిని కూడా తీసేశారు. రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచిన ఆర్టికల్ వల్లనే తెలంగాణ ఏర్పడిందని, అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ట్యాంక్ బండ్ దగ్గర పెడతానని సీఎం కేసీఆర్​ చెప్పి ఐదేండ్లయినా ఆ ఊసే లేదు. 

 - సాయిని నరేందర్, సోషల్​ ఎనలిస్ట్