బురద రోడ్లపై నాట్లు వేసిన టీడీపీ శ్రేణులు
కోల్‌బెల్ట్, వెలుగు: క్యాతనపల్లి మున్సిపాలిటీలోని ప్రజల సమస్యలను చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ పట్టించుకోవడం లేదని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బి.సంజయ్‌కుమార్ ఆరోపించారు. బుధవారం క్యాతనపల్లి నుంచి రామకృష్ణాపూర్‌కు వెళ్లే మార్గంలో బురదమయంగా మారిన రోడ్డుపై టీడీపీ లీడర్లు, కార్యకర్తలు నాట్లు వేసి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. పదేళ్లు దాటిన ఇప్పటి వరకు క్యాతనపల్లి రైల్వే గేటు వద్ద రైల్వే ఫ్లైఓవర్ అప్రోచ్ రోడ్డు పనులను ఎమ్మెల్యే పూర్తి చేయించలేకపోయారన్నారు.
ఆయన నిర్లక్ష్యం కారణంగా ఏటా వర్షాకాలం స్థానికులు, ప్రయాణికులు బురదరోడ్లుపై ప్రయాణించాల్సిన పరిస్థితి ఉందన్నారు. బురదమయంగా మారిన రోడ్డుపై వెళ్లిన స్థానికులకు లీడర్లు సాయం చేశారు. కార్యక్రమంలో లీడర్లు విజయ గిరి శంకర్, మెరుగు శంకర్, మందమరి మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షుడు జక్కుల సమ్మయ్య,ప్రధాన కార్యదర్శి గిర్నాల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.