
కోరుట్ల, వెలుగు : తల్లి క్యాన్సర్‌తో బాధపడుతుండడానికి తోడు ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన ఓ బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకొని వాట్సప్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల విలీన గ్రామమైన ఎకిన్‌పూర్‌లో గురువారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎకిన్‌పూర్‌కు చెందిన ఆరెల్లి వెంకటి అలియాస్ స్వామి-, పద్మ దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కొడుకు అజయ్ (23) చెన్నైలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు.
ఎకిన్‌పూర్‌లో మల్లన్న జాతర జరగడంతో ఇటీవల ఇంటికి వచ్చాడు. అతడి తల్లి పద్మ క్యాన్సర్‌తో బాధపడుతుండడం, ట్రీట్‌మెంట్‌కు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుండడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తల్లి క్యాన్సర్‌తో బాధపడుతుండడం, తండ్రి తల్లిని కోప్పడుతుండడంతో పాటు ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన అజయ్ గురువారం గ్రామ శివారులోని పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి, సెల్ఫీ వీడియో తీసుకొని వాట్సప్‌లో బంధువులకు పంపించాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఘటనాస్థలానికి వెళ్లి అజయ్‌ని కోరుట్ల అక్కడి నుంచి కరీంనగర్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ శుక్రవారం చనిపోయాడు. తండ్రి వెంకటి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాంచంద్రం తెలిపారు.