
- డీఎంకే, కాంగ్రెస్ కూటమి భారీ విజయం
- రాష్ట్రంలో ఖాతా తెరవని బీజేపీ
- ఫలితమివ్వని అన్నామలై అస్త్రం
చెన్నై: తమిళనాడు లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో స్టాలిన్ ఆధ్వర్యంలోని డీఎంకే పార్టీ బహుబలి విజయం సొంతం చేసుకుంది. డీఎంకే, కాంగ్రెస్ కూటమి రాష్ట్రంలోని మొత్తం 39 సీట్లను క్లీన్ స్వీప్ చేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం చేస్తూ ఇండియా కూటమి భారీ విజయాన్ని సాధించింది.
‘‘నర్పతుం నమతే, నడుం నమతే”(మొత్తం 39 సీట్లకు మనవే) అనేది నినాదంతో ఎన్నికలకు వెళ్లిన డీఎంకే కూటమి.. అన్నింటినీ గెలుచుకొని అద్భుతమైన విజయాన్ని సాధించింది. డీఎంకే స్టార్ కాంపెయినర్ కనిమొళి, నీలగిరి నుంచి రాజా, సెంట్రల్ చెన్నై నుంచి దయానిధి మారన్, శ్రీపెరంబుదూర్ నుంచి టీఆర్ బాలు సహా కూటమి పార్టీలు కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం), వీసీకే ఎండీఎంకే, ఐయూఎంఎల్‌కు చెందిన అభ్యర్థులంతా తిరుగులేని మెజార్టీతో గెలిచారు.
పలు రాష్ట్రాల్లో యాంటీ మోదీ వేవ్: స్టాలిన్
తమిళనాడులో ఎన్నికల విజయంపై స్టాలిన్ స్పందిస్తూ.. ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయాన్ని దివంగత డీఎంకే అధినేత ఎం కరుణానిధికి అంకితం ఇస్తున్నట్టు చెప్పారు. ఈ ఎన్నికల ఫలితాల్లో యాంటీ మోదీ వేవ్ పలు రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపించిందని చెప్పారు. బీజేపీ ధనబలం, అధికార దుర్వినియోగాన్ని తుంగలో తొక్కిన ఈ విజయం చారిత్రాత్మకమని పేర్కొన్నారు.
400 సీట్లకు పైగా గెలుస్తామని చెప్పుకోవడం ద్వారా బీజేపీ ఈ ఎన్నికలలో తమకు ప్రత్యర్థులు లేరనే భావన తీసుకురావడానికి ప్రయత్నించింది, కానీ అది కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సాధారణ మెజారిటీని కూడా పొందలేకపోయిందన్నారు. బుధవారం ఢిల్లీలో జరగనున్న ఇండియా కూటమి పార్టీల సమావేశానికి హాజరు కానున్నట్టు చెప్పారు.
ఫలించిన సామాజిక న్యాయం నినాదం
తమిళనాడులో కాంగ్రెస్, కమ్యూనిస్టులతో కూడిన డీఎంకే కూటమి విజయపరంపర 2019 లోక్‌సభ ఎన్నికలల్లోనే ప్రారంభమైంది. 2021 అసెంబ్లీ ఎన్నికలు, ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో కూడా అది కొనసాగి పెద్ద విజయాన్ని కైవసం చేసుకుంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్‌లో కోయంబత్తూరులో నిర్వహించిన ర్యాలీలో స్టాలిన్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాలిన్ ప్రసంగిస్తూ ర్యాలీకి హాజరైన ప్రజల సంఖ్యను వివరించడానికి ‘బాహుబలి’తో పోల్చారు. సామాజిక న్యాయం అనే నినాదంతో స్టాలిన్ ఎన్నికలకు వెళ్లారు.
సైద్ధాంతిక కూటమి (కోల్‌గాయ్ కూటనీ) అని ప్రచారం చేశారు. ప్రధాని మోదీకి మళ్లీ ఓటు వేస్తే.. బీజేపీకి సామాజిక న్యాయం అంటే అలెర్జీ కనుక మొదట రిజర్వేషన్లను తొలగిస్తారని, తర్వాత రాజ్యాంగాన్ని కూడా మారుస్తానని ప్రచారం చేశారు.
బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలై ఓటమి
తమిళనాడులో బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. మాజీ ఐపీఎస్ ఆఫీసర్, బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలై.. మీ కొడుకును, మీ తమ్ముడిని (వీటు పిళ్లై.. ఉంగల్ తంబి) అంటూ చేసిన ప్రచారం ఓట్లను పెంచిందే తప్ప సీట్లను తీసుకురాలేకపోయింది. రాష్ట్రంలో 3 నుంచి 5 సీట్లలో బీజేపీ గెలుస్తుం దన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి.
కోయంబత్తూరు నుంచి బరిలో దిగిన అన్నామలై పై డీఎంకే అభ్యర్థి గణపతి రాజ్‌కుమార్ విజయం సాధించారు. తెలంగాణ గవర్నర్‌గా పనిచేసిన తమిళిసై, ప్రముఖ నటి రాధిక తదితర ఎన్డీఏ అభ్యర్థులంతా ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో 6% ఓట్ షేర్ ఈసారి 11 శాతానికి పెరగడం బీజేపీకి కాస్త ఓదార్పును ఇచ్చే అంశం.