ప్రాబ్లమ్స్​లో పతంజలి

ప్రాబ్లమ్స్​లో పతంజలి

పతంజలి పేరు నిత్యావసరాల జాబితాలో ఒకటిగా మారుమోగింది. టూత్​పేస్టులు మొదలు సబ్బులు, నూనెలు, బిస్కెట్లు, మేకప్​ సామగ్రి.. ఇలా ఇదీ అదీ అని లేకుండా ఫాస్ట్​ మూవింగ్​ కన్స్యూమర్​ గూడ్స్​(ఎఫ్​ఎంసీజీ) కేటగిరీలో రికార్డు టర్నోవర్​ సాధించింది. మొదట్లో ఆయుర్వేద ఉత్పత్తుల అమ్మకాలతో ఆరంభమైంది. యోగా గురువు బాబా రామ్​దేవ్​ తన ఫ్రెండ్​ ఆచార్య బాలకృష్ణతో కలిసి 2009లో ఉత్తరాఖండ్​లోని హరిద్వార్​లో ప్రారంభించారు. ఆ తర్వాత ఏడాదే దీని బిజినెస్​ మాడ్యూల్​ మారిపోయింది. ఒక్కసారిగా వ్యాపారం ఊపందుకుంది. క్రమంగా సబ్బులు, షాంపూలు, పేస్టులు, నూడిల్స్​ వగైరా వెయ్యికి పైగా ప్రొడక్ట్​లను తీసుకొచ్చే స్థాయికి ఎదిగింది.  దేశవ్యాప్తంగా ప్రత్యేక స్టోర్లు ఓపెన్​ చేయటంతో ఒక వస్తువు కొనడానికి వచ్చేవాళ్లు నాలుగైదు ప్రొడక్ట్​లు కొనే ఛాన్స్​ వచ్చింది. పతంజలి ఉత్పత్తులకు బాబా రామ్‌‌దేవ్​ బ్రాండ్​ అంబాసిడర్​ కాగా, తెర వెనక మొత్తం బాలకృష్ణే చూసుకుంటారు.

ల్యాబ్​ నుంచి వచ్చిన ప్రొడక్ట్‌‌ని ఓకే చేసి, ప్యాక్‌‌ చేసి, మార్కెట్‌‌కి తరలించే వరకూ ప్రతిదీ ఆయన కంట్రోల్​లోనే జరుగుతుంది. ‘స్వదేశీ సంస్థ’ ముద్రతో ఎఫ్​ఎంసీజీ రంగంలో దూసుకెళ్లింది. 2014–15లో దీని టర్నోవర్​ రూ.2,000 కోట్లు. రెండేళ్లు గడిచేసరికి​ 2016–17లో రూ.10,000 కోట్లకు​ పెరిగింది. 2018–19లో అమ్మకాలను రెట్టింపు చేస్తామని ప్రకటించారు. కానీ, రూ.8,100 కోట్లతోనే సరిపెట్టుకున్నారు. దీంతో పతంజలికి ప్రాబ్లమ్స్​ మొదలయ్యాయి.

సేల్స్​ తగ్గటానికి కారణాలనేకం

దేశంలో గ్రోత్​ రేట్​ తగ్గటం​తో ఆ ప్రభావం​ ‘పతంజలి’పైనా పడింది. అయితే ఈ సంస్థ సేల్స్​ భారీగా పడిపోవటానికి నెగెటివ్​ ఎకానమీతోపాటు సొంత తప్పిదాలూ ఉన్నాయి. సరైన ప్లాన్లు లేకుండా వ్యాపారాన్ని​ విస్తరించటం; సప్లయి చైన్​ సిస్టమ్, బిజినెస్​ పద్ధతులు పక్కాగా లేకపోవటం; క్వాలిటీని ఒక్కతీరుగా మెయింటెయిన్​ చేయకపోవటం వంటి కారణాల వల్ల ‘పతంజలి’ అమ్మకాలు దెబ్బతిన్నాయని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.

పతంజలి సేల్స్​ అర్బన్​ ఏరియాల్లో నేలచూపులు చూస్తున్నాయని, రూరల్​ ప్రాంతాల్లో మూడో స్థానాని​కి పరిమితమయ్యాయని గ్లోబల్​ కన్​జ్యూమర్​ రీసెర్చ్​ సంస్థ ‘కంతర్ వరల్డ్​ ప్యానెల్​’ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్​ నాటికి పట్టణాల్లో అమ్మకాలు 2.7 శాతం తగ్గగా పల్లెల్లో నామమాత్రంగా 15.7 శాతమే పెరిగాయి. కిందటేడాది ఈ సేల్స్​ అర్బన్​ ఏరియాల్లో 21.1 శాతం, రూరల్​లో 45.2 శాతం ఉండటం విశేషం. 2018 డిసెంబర్​ 31 నాటికి పతంజలి ప్రొడక్ట్​ల అమ్మకాల విలువ రూ.4,700 కోట్లు మాత్రమేనని రాయిటర్స్​ రిపోర్ట్​ తెలిపింది.

ఇతర సంస్థల నుంచి గట్టి పోటీ

ఒక వైపు ఎకానమీ స్లోడౌన్​ ప్రభావంతో పతంజలి వ్యాపారం దెబ్బతినగా, మరో వైపు పోటీ సంస్థలు ముందు జాగ్రత్తతో బెటర్​ పొజిషన్​లో ఉన్నాయి. హిందుస్థాన్​ యూనీ లీవర్ (హెచ్​యూఎల్​) గ్రోత్​ ఈ ఏడాది ఫస్ట్​ క్వార్టర్​లో 5.5 శాతంగా మాత్రమే నమోదైంది. మారికోస్​ కంపెనీ సేల్స్​ ఈ సంవత్సరం తొలి మూడు నెలల్లో 7 శాతం, డాబర్​ ఇండియా అమ్మకాలు 6 శాతం జరిగాయి. అంతమాత్రాన ఇవి పుంజుకున్నాయని చెప్పలేం. ఈ సంస్థల బిజినెస్​ గతేడాదితో పోల్చితే సగానికి పైగా పడిపోగా, పతంజలి వ్యాపారం అంతకంటే ఘోరంగా తగ్గిపోయింది.

కనిపించని యాడ్స్​

పతంజలి వ్యాపారం దెబ్బతినటం ఆ సంస్థ ప్రచార కార్యక్రమాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో టీవీలు, రేడియోలు, ప్రింట్​ మీడియాలో కంపెనీ ప్రొడక్ట్స్​ గురించి విపరీతంగా యాడ్స్​ వచ్చేవి. ఇప్పుడు మచ్చుకైనా కనిపించట్లేదు. 2016లో పతంజలి.. ఎఫ్​ఎంసీజీ రంగంలో మూడో పెద్ద అడ్వర్టయిజర్. డెట్టాల్​ తయారీ సంస్థ రెకిట్​ బెంకైజర్​ గానీ, యూనీ లీవర్​ గానీ పతంజలి తర్వాతే ఉండేవి. ఆమధ్య యాడ్స్​ బాగా తగ్గించేసుకుంది. 2018 జూలై నాటికి 11వ స్థానానికి, 2019లో 40వ ర్యాంక్​కి పతంజలి పడిపోయినట్లు యాడెక్స్​ ఇండియా డేటా చెబుతోంది.

9 నెలలుగా కొత్త ప్రొడక్టే లేదు

పతంజలి ఆయుర్వేద సంస్థ నుంచి గడచిన తొమ్మిది నెలల్లో ఒక్క కొత్త ప్రొడక్టయినా మార్కెట్​లోకి దింపలేదు. శిశు కేర్​ వంటి బేబీ కేర్ ప్రొడక్ట్స్​పై గతంలో ఎన్నడూ లేనంతగా హైప్​ క్రియేట్​ చేశారు. కానీ మూడు నెలల నుంచి ఇవి మార్కెట్​లో లేకుండాపోయాయి. ఆన్​లైన్​ ప్లాట్​ఫామ్స్​లో కొందామన్నా స్టాక్​ లేదు. పతంజలి స్టోర్లకు రెగ్యులర్​గా వచ్చే కస్టమర్లు ఖాళీ చేతులతో వెళ్లిపోవాల్సి వస్తోందని ఢిల్లీ–ఎన్​సీఆర్​ రీజియన్​ నుంచి పెద్దఎత్తున కంప్లయింట్లు వస్తున్నాయి.

ఔట్​లెట్ల మూసివేత

ఢిల్లీలోని ఫేమస్​ షాపింగ్ ఏరియా(కన్నాట్​ ప్లేస్​)లో ఉన్న పతంజలి ‘చికిత్సాలయ’కి జనం ఎక్కువగా వచ్చేవాళ్లు. ఈ స్టోర్​ బయట రామ్​దేవ్​ బాబా నవ్వుతూ కనిపించే సైన్​ బోర్డ్​ స్పెషల్​ ఎట్రాక్షన్​గా నిలిచేది​. ఇప్పుడా స్టోర్​ ఓ టొబాకో ఔట్​లెట్​గా మారిపోయింది. రామ్​దేవ్​ సైన్​బోర్డుని మాత్రం అలాగే ఉంచేశారు!. పతంజలి ప్రొడక్ట్​ల సేల్స్​ టాప్ రేంజ్​లో ఉండే గోల్​ మార్కెట్​లోని ఒక ఔట్​లెట్​లో స్టాక్​ ఎప్పుడో అయిపోయింది. వాటికి బదులు వేరే కంపెనీల ప్రొడక్ట్స్​ వస్తున్నాయి.

మార్కెట్​లో పతంజలి ప్రొడక్ట్​ల స్టాక్​ లేకపోవటంతో ఆ సంస్థ బ్రాండ్​ నేమ్​ పడిపోతోందని రిటెయిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో నెలకు రూ.15 వేలు వచ్చే మార్జిన్​ ఇప్పుడు నాలుగైదు వేల రూపాయల మార్జిన్​తోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. అది కాస్తా కరెంట్​ బిల్లులకు, రెంట్​లకే సరిపోవట్లేదని, బిజినెస్​ దివాలా తీస్తోందని వ్యాపారులు వాపోతున్నారు. ఆయుర్వేద డాక్టర్​కి, నలుగురు స్టాఫ్​కి జీతాలు ఇవ్వటానికి అప్పులు చేయాల్సి వస్తోందని, ఈ పరిస్థితుల్లో స్టోర్లు మూసేయటం తప్ప గత్యంతరం లేదని చెబుతున్నారు.

‘రుచి సోయా’తో దశ తిరిగేనా?

పతంజలి ప్రొడక్ట్​ల సేల్స్​ సంగతి ఎలా ఉన్నా ఆ సంస్థ ‘రుచి సోయా’ అనే మరో సంస్థను సొంతం చేసుకుంది. తద్వారా సోయాబీన్​ ఆయిల్స్​, ఇతర ఉత్పత్తుల రంగంలో పెద్ద కంపెనీగా ఎదగనుంది. అప్పుల్లో కూరుకుపోయిన ‘రుచి సోయా’కు మ్యానుఫ్యాక్చరింగ్​ ప్లాంట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. న్యూట్రెలా, మహాకోష్​, సన్​రిచ్​, రుచి స్టార్,  రుచి గోల్డ్​ వంటి లీడింగ్​ బ్రాండ్లు ఆ సంస్థ నుంచి వచ్చినవే.  రెండేళ్ల కిందట రూ.9,345 కోట్ల అప్పుల భారంతో ఇది దివాలా తీసింది. ఈ కంపెనీని పతంజలి సంస్థ అదానీ విల్మర్​తో పోటీపడి మరీ దక్కించుకుంది.  రూ.4,350 కోట్లతో పతంజలి ఇచ్చిన డెట్​ రిజల్యూషన్​ ప్లాన్​కి ‘కమిటీ ఆఫ్​ క్రెడిటర్స్​’ ఏప్రిల్​ 30న ఆమోదం తెలిపారు. నేషనల్​ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)​ కూడా ఈ నెల 6న ఓకే చెప్పింది. ఈ ప్లాన్​లో భాగంగా ‘రుచి సోయా’ బాకీలు తీర్చటానికి రూ.3,233.36 కోట్లు, ఈక్విటీ కింద రూ.204.75 కోట్లు, క్రెడిట్​ గ్యారెంటీగా సుమారు రూ.12 కోట్లు, క్యాపిటల్​ ఎక్స్​పెండిచర్​ కోసం రూ.115 కోట్లు పతంజలి ఇస్తుంది. బిజినెస్​పరంగా డల్​గా ఉన్న రామ్​దేవ్​ బాబా ‘పతంజలి’ దశను ‘రుచి సోయా’ ఎటువైపు తిప్పుతుందో చూడాలి.