భవిష్యత్​ ఇండియా కూటమిదే

భవిష్యత్​ ఇండియా కూటమిదే

దేశంలో వైరుధ్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. పార్లమెంటరీ విధానంలో పరిపాలన సాగినా.. పురాతన కాలంనాటి రాజరికపు ఛాయలు పోవడం లేదు. బాబా సాహెబ్​అంబేద్కర్​రాజరికాన్ని ధ్వంసం చేసి నూతన ప్రజాస్వామిక విలువలతో రాజ్యాంగాన్ని అందించాడు. కానీ సనాతన ధర్మం పేరుతో ఆర్ఎస్ఎస్, బీజేపీ దేశంలో తమదైన శాసనాన్ని అమలు చేయాలని చూస్తున్నాయి. దేశంలో వలసపాలకుల దాడుల వల్ల ఇస్లాం, క్రైస్తవం బలపడింది. ఆ భిన్నత్వాన్ని గౌరవిస్తూ 565 సంస్థానాలను భారత దేశంగా ఏర్పడేందుకు కృషి చేసింది కాంగ్రెస్. అయినా ఆరోజున మహ్మద్​అలీ జిన్నా, గోల్వల్కర్, సావర్కర్,​ హెగ్డేల వల్ల మత పునాదులు బలపడ్డాయి. స్వాతంత్ర్య సంగ్రామంలో కూడా ఆ తేడా స్పష్టమయ్యేది. ఆ వైరుధ్యం కాస్తా ప్రత్యేక పాకిస్థాన్​ దేశం ఏర్పాటుకు కారణమైంది. మరో వైపు హిందూ ముస్లిం వ్యతిరేక కూటములుగా విడిపోయాయి. ముస్లింలకు బ్రిటీష్​ ప్రభుత్వం రిజర్వేషన్లు ఇవ్వాలని ఆలోచించడాన్ని వ్యతిరేకించారు. అలా మొదలైన వైరం రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​ఏర్పాటుకు కారణమైంది. 

ఆ రోజున హెగ్డేవార్​ ఒక మాట అన్నట్లుగా చరిత్ర చెబుతోంది. ‘ఈ దేశాన్ని అన్ని కులాల మతాల సమాహారంగా చేయడాన్ని నేను అంగీకరించను. నేను కాకపోయినా భవిష్యత్​ఆర్ఎస్ఎస్​ వారసులైనా దాన్ని సహించరు’ అని చెప్పడం దేనికి సంకేతం? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను క్షుణ్నంగా పరిశీలిస్తే 100 ఏండ్లకు పూర్వం హిందూ దేశంగా మారుతుంది అని హెగ్డేవర్​ అన్న మాటను నిజం చేయడానికి ఆర్ఎస్ఎస్​– బీజేపీ కూటమి ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తున్నది. ఇప్పుడు వాళ్లకున్న బలం 300 + సీట్లయితే మత విధ్వేషాలు రెచ్చగొట్టి 80 శాతం హిందువుల ఓట్ల వాళ్లే వేయించుకున్నా 400 + సీట్లు సాధించడం సులభం. కాబట్టి వాటితో అసాధారణ మెజార్టితో  సెక్యులర్’ పదాన్ని తీసేసి ‘హిందూ’ పదాన్ని చేర్చడం ద్వారా సౌభ్రాతృత్వాన్ని చెడగొట్టే యత్నం చేస్తున్నారు. 

రాజ్యాంగాన్ని మార్చే యత్నం..

రాజ్యాంగ సమయంలో ఆనాడు హిందూ, ముస్లిం, సిక్ ఈ సాయి అన్ని మతాలను సంప్రదించి ముసాయిదాని ఆమోదించారు. గాంధీ, బాబూ రాజేంద్ర ప్రసాద్, నెహ్రూ, అబుల్​కలామ్​ఆజాద్​లాంటి పోరాట యోధులతోపాటు ప్రజాస్వామికవాదుల కల నేటి రాజ్యాంగం. అది కాంగ్రెస్​పార్టీ హయాంలో రావడం, జాతి మొత్తం దాన్ని అంగీకరించి అనుసరించడం ఆర్ఎస్ఎస్​కు నచ్చలేదు. ఏ విధంగా దాన్ని నిర్వీర్యం చేయాలని ప్రతిసందర్భాన్ని వాడుకుంటున్నది. అందుకే మోదీ, అమిత్​షా పాలనలో విద్వేషాలు పెరుతున్నాయి. విద్వేషంతో మత రాజ్యంగా మార్చాలనే ప్రయత్నాలు పెరిగాయి. ఇందులో భాగంగానే కాంగ్రెస్​ బలహీనంగా ఉన్న ఈ సందర్భంలోనే రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారు. రాహుల్​గాంధీ లోక్​సభ సభ్యత్వం రద్దు చేసి, అధికారిక నివాసాన్ని ఖాళీ చేయించడం, కాంగ్రెస్​మీద, గాంధీ కుటుంబం మీద విషం చిమ్మడం అందులో భాగమే. 

కూటమి వైపే అందరూ..

సెక్యులర్ శక్తులన్నీ రాహుల్​గాంధీ వైపు చూస్తున్నాయి. భారత్​జోడో యాత్రతో తను నిప్పు అని నిరూపించుకున్న తర్వాత మతవాద శక్తులకు అసలైన ప్రత్యర్థి రాహుల్​గాంధీనే అని తలచి ఇండియా కూటమికి సమాయత్తమయ్యాయి. మమతా బెనర్జీ, కేజ్రీవాల్​లాంటి వాళ్లు సైతం ‘ఇండియా’ వైపే ఉన్నారు. మొన్నటిదాకా ఎన్​డీఏలో ఉన్న నితీశ్​కుమార్​‘ఇండియా’ కూటమిలో కీలకంగా మారాడు. కేసీఆర్ మాత్రం గోడమీద పిల్లివాటంగా.. ఎన్ డీఏతో లేను.. ఇండియాతో లేనంటూ నటిస్తున్నాడు. అంతర్గతంగా బీజేపీతో ఒప్పందంతో ఉన్న కేసీఆర్..​మరో ప్రత్యామ్నాయమవుతా అని గప్పాలు కొడుతూ తెలంగాణకే పరిమితమయ్యాడు. మహారాష్ట్రలో పార్టీని విస్తరిస్తున్నట్టు నటిస్తున్న తీరు అంతా.. తెలంగాణలో అధికారంలోకి రావడానికి జరుగుతున్న ప్రయత్నమే అని తెలుస్తున్నది. కర్నాటక తర్వాత దేశ ప్రజల్లో వచ్చిన మార్పు కాంగ్రెస్​తో కూడిన కూటమి వైపు మొగ్గు చూపడం వల్ల ఐక్యత కోసం ఇండియా కూటమి ఏర్పడింది. చివరగా ఒకమాట. ఇందిరా గాంధీ, రాజీవ్​గాంధీ భారత సమాజం కోసం ప్రాణాలర్పించారు. ఆర్ఎస్ఎస్​పరివార్​మాత్రం.. వాళ్లు బతికి ఇండియాను చంపేస్తున్నారు. భారత ప్రజలు ప్రజాస్వామ్యానికి అలవాటుపడ్డారు. వాళ్లు ప్రజాస్వామ్యాన్ని కాపాడతారు.. ‘ఇండియాను’ గెలిపిస్తారు.

తగ్గిన మోడీ ప్రభ..

మణిపూర్​మారణకాండ ఈ దేశంలో దేనికి సంకేతం. ఎన్నో ఏండ్ల నుంచి స్వాతంత్ర్యం అనుభవిస్తున్న ఈ దేశపు మహిళ తాజా ఘటనలతో సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నది. మణిపూర్​ హింసను జాతుల మధ్య వైరంగా చిత్రీకరించినా.. అది రాజ్యాంగ వ్యతిరేకంగా మారిన తీరు ఆలోచించాలి. ఇపుడు ‘ఇండియా’ కూటమి అవసరం ఎందుకు వచ్చిందంటే.. కారణం ఇదే! బీజేపీ ఆధిపత్యాన్ని కోరుకుంటే, మానవవాదం సమానత్వాన్ని కోరుకుంటోంది. అవిద్య, పరిపాలన సామర్థ్యం లేకపోవడం, ప్రజాస్వామిక విలువలు తెలియకపోవడం, కుట్రల నేపథ్యంతో వచ్చిన మోడీ వ్యక్తిత్వం బయటపడుతోంది. నోట్ల రద్దు, ద్రవ్యోల్బణం పెరుగుదల, 155 లక్షల కోట్లకు పైగా అప్పులు, ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మడం, ఇంధన, గ్యాస్​ ధరలు పెంచడం, దళిత, గిరిజన, మహిళలపై దాడులు మోడీ ప్రభను తగ్గించాయి.