మే డే ప్రపంచ కార్మికుల పండగ. కార్మికుల శ్రమ ద్వారా అపార సంపద పోగేసుకుంటున్న పెట్టుబడిదారులు వారిని కనీసం మనుషుల్లాగా కూడా చూడని దారుణమైన రోజులవి. అప్పట్లో రోజుకు 16 గంటల వరకు కార్మికులు పనిచేసేవారు. ఈ పరిస్థితుల్లో కార్మికులు తిరుగుబాటు బావుటా ఎగరేశారు. ఇందులో ముఖ్యమైంది రోజుకు ఎనిమిది గంటల పని హక్కు. ఈ హక్కు కోసం కార్మికులు పోరాడి విజయం సాధించారు. ఈ పోరాటంలో భాగంగా వందలాది మంది కార్మికులు ప్రాణాలర్పించారు. 1886 మే మూడో తేదీన చికాగో లోని హే స్వ్కేర్ దగ్గర పోలీసు కాల్పుల్లో ఒక వైపు రక్తం చిందుతుంటే మరో వైపు ఆ రక్తంలో తడిసిన ఎర్రబట్టను తమ జెండాగా కార్మికులు పైకెత్తి చూపారు.
ఇండియాలో భిన్నమైన పరిస్థితులు
ప్రపంచ కార్మికులు దేశాలకు, జాతులకు, భాషలకు అతీతంగా ఏకమై హక్కుల కోసం నినదిస్తుంటే, ఇండియాలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. జాతీయ వనరులను ఇక్కడి కార్మికుల శ్రమ ద్వారా ముడి సరుకుగా మార్చి ఇంగ్లాండుకు తరలించి, వాటి ద్వారా తయారైన ఉత్పత్తులను మళ్లీ ఇండియాలో అమ్ముతూ దేశసంపదను కొల్లగొట్టింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం. దీంతో దేశీయ ఉత్పత్తి రంగం కోలుకోలేని విధంగా దెబ్బతిన్నది. అయినప్పటికీ ఇక్కడి కార్మికులలో చలనం రాలేదు. తిరుగుబాటు వైఖరి లోపించింది. దీనికి కారణం కార్మికుల అనైక్యత. కొన్ని వేల ఏళ్లుగా భారతదేశ సమాజాన్ని పీడిస్తున్న కులవ్యవస్థ. దీని ప్రభా వంతో కార్మికులు కులాలుగా విడిపోయారు. కార్మికులంతా ఒకటే అనే భావన ఏర్పడలేదు. చివరకు రెండు ప్రపంచ యుద్ధాల కాలంలో పెట్టు బడిదారీ వర్గాల మీద కార్మిక సంఘాలు ఒత్తిడి తీసుకువచ్చి తమ హక్కులు సాధించుకున్నాయి. కానీ భారతదేశంలో మాత్రం హక్కుల సాధనకు కార్మికుల్లోని అనైక్యత అడ్డుగా నిలిచింది. ఈ పరిస్థితుల్లో కార్మిక సమాజానికి కొండంత అండగా , ఒక మెస్సయ్యగా వచ్చారు బాబా సాహెబ్ అంబేద్కర్.
1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా లభించిన అవకాశాలను కార్మికుల అభివృద్ధికి వాడుకునే ఆలోచనతో 1936 ఆగస్టులో ‘ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ’ (ఐఎల్ పీ) స్థాపించారు. 1937 ప్రొవిన్షియల్ కౌన్సిల్ ఎన్నికల్లో విజయం సాధించి బ్రిటిష్ ప్రభుత్వం ముందు కార్మికుల గొంతు బలంగా వినిపించారు. కార్మికులకు కనీస వేతనాలు, మోడర్న్ టెక్నాలజీ పై శిక్షణ వంటి అనేక కార్మిక శ్రేయస్సు విధానాల అమలు కోసం ఇండియన్ లేబర్ పార్టీ కృషి చేసింది. 1942 జులై ఏడో తేదీన వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో లేబర్ మెంబర్ గా బాబా సాహెబ్ అంబేద్కర్ పాల్గొనడం భారత కార్మిక హక్కుల చరిత్రలో ఒక మైలురాయిగా భావించాలి. కార్మికుల జీవన ప్రమాణాల పెంపుకోసం అనేక రకాల చట్టాలు తీసుకురావడానికి అంబేద్కర్ తీవ్రంగా కృషి చేశారు. కార్మిక, యాజమాన్య సమస్యల పరిష్కారం కోసం కార్మిక వివాదాల చట్టం సహా అనేక చట్టాలు తీసుకువచ్చిన ఘనత బాబా సాహెబ్ అంబేద్కర్ దే. ఇండియాలో కార్మికుల సంఘటితం కాలేని పరిస్థితులు ఉన్నప్పటికీ ఇన్ని హక్కులు, సదుపాయాలు వారికి దక్కాయంటే అది అంబేద్కర్ కృషి ఫలితమే.
మే డే సందర్భంగా చిన్న చిన్న నాయకులను కూడా గొప్పగా తలచుకునే కమ్యూనిస్టులు, అంబేద్కర్ ను ప్రస్తావించకపోవడం కరెక్ట్ కాదు. కార్మిక వర్గ శ్రేయస్సు కోసం ఆయన చేసిన కృషిని కావాలని మరుగునపరిచే కుట్రలో భాగమే. వందల కొద్దీ చట్టాలు ఉన్నా అవి సరిగా అమలుకు నోచుకోకుండా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న ఈ సమయంలో బాబా సాహెబ్ ఆలోచనా విధానమే ఇండియాకు శరణ్యం.
జై భీమ్ !…జై భారత్ !!
– కరుణాకర్ బహుజన్
(తెలంగాణ, ఏపీ రాష్ట్రాల బీఎస్ఎఫ్ఐ కో ఆర్డినేటర్ )