కరెన్సీపై బాబా సాహెబ్​

దేశం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన వ్యక్తి బాబా సాహెబ్​ అంబేద్కర్. సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధుడు, నిత్య పరిశోధకుడు, నిస్వార్థపరుడు, మేధావి ఇలా ఎన్ని మాటలు చెప్పినా ఆయనకు సరిపోతాయి. అంటరానితనం, అస్పృశ్యత, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన.. వాటిని రూపుమాపేందుకు ఎంతో శ్రమించారు. రిజర్వ్​ బ్యాంకు ఏర్పాటులో కీలకపాత్ర పోషించినా ఆయన ఫొటోను కరెన్సీపై ముద్రించడం లేదు. ఇప్పటికైనా ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

అంబేద్కర్​ అసలు పేరు భీమ్‌‌ రావ్​ రాంజీ. తండ్రి రాంజీ మాలోజీ సక్‌‌పాల్, తల్లి భీమాబాయి. వీరిది అంటరాని కులాల్లో ఒకటైన మహార్‌‌ కులం. సక్​పాల్ బ్రిటీష్‌‌ సైన్యంలో పనిచేసేవాడు. పూర్వీకులది మహారాష్ట్రలోని అంబవాడే అనే చిన్నపల్లెటూరు. మధ్యప్రదేశ్‌‌లో సక్​పాల్​ పనిచేస్తుండగా 1891 ఏప్రిల్‌‌ 14న భీమ్​రావ్​ పుట్టారు. ఇంట్లో వాళ్లంతా ఆయనను భీమా అని పిలిచేవారు. ఆరేండ్ల వయసులో తల్లి చనిపోగా.. ఆలనాపాలన అంతా మేనత్త మీరాబాయి చూసుకునేది. ఆ రోజుల్లో దళితులను మనుషులుగా కూడా చూసే వారు కాదు. కానీ, అంబేద్కర్‌‌ అనే ఒక బ్రాహ్మణ టీచర్​ భీమాపై ఎంతో ప్రేమ చూపించేవాడు. చివరకు తన ఇంటి పేరునే భీమాకు పెట్టి భీమ్‌‌ రావ్‌‌ రాంజీ అంబేద్కర్​గా స్కూల్​ రికార్డ్స్​లో నమోదు చేశారు. ఆ రోజుల్లో మెట్రిక్‌‌ పరీక్షను చాలా కష్టమైనదిగా భావించేవారు. అంటరాని కులానికి చెందిన స్టూడెంట్లలో మెట్రిక్‌‌ పాసైన మొదటి వాడు అంబేద్కరే. దీంతో బరోడా రాజు సయాజీరావ్‌‌ గైక్వాడ్​ నెలకు రూ.20 స్కాలర్‌‌షిప్‌‌ మంజూరు చేశారు. 1912లో అంబేద్కర్‌‌ బీఏ పాసయ్యారు. బరోడా మహారాజు ఉన్నత చదువుల కోసం కొందరు స్టూడెంట్లను అమెరికా పంపాలనుకున్నారు. 22 ఏండ్ల అంబేద్కర్‌‌ కూడా వారిలో ఒకరు. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ నుంచి 1915లో ఎంఏ పట్టా పుచ్చుకున్నారు.1927లో కొలంబియా యూనివర్సిటీ నుంచి అంబేద్కర్‌‌ ఎకనామిక్స్​లో పీహెచ్​డీ పొందారు. విదేశాల్లో ఎకనామిక్స్ లో డాక్టరేట్​ సాధించిన తొలి భారతీయుడు అంబేద్కర్.
రిజర్వ్​ బ్యాంక్​ ఆలోచన ఆయనదే
1921లో ఇంపీరియల్‌‌ బ్యాంక్​ ఏర్పాటైంది. ఇంపీరియల్‌‌ అనగా ‘రాజా’ అని అర్థం. రిజర్వ్​ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ ఇండియా(ఆర్బీఐ)కు ముందు ఇదే మన దేశానికి సెంట్రల్‌‌ బ్యాంకుగా ఉండేది. అయితే ఇది తన విధులు సక్రమంగా నిర్వహించడంలో విఫలమైంది. దాంతో రూపాయి విలువ దారుణంగా పడిపోవడం మొదలైంది. అలాంటి పరిస్థితుల్లో రూపాయి విలువ పడిపోకుండా పరిష్కార మార్గాలను అంబేద్కర్‌‌ రాసిన పుస్తకాన్ని రాయల్‌‌ కమిషన్‌‌ కు, ఆన్‌‌ కరెన్సీ ఆఫ్‌‌ ఇండియన్‌‌ రూపీ ఆఫ్‌‌ ఫైనాన్స్‌‌ పుస్తకాన్ని హిల్టన్​ యంగ్‌‌ కమిషన్‌‌కు ఇచ్చారు. అలాగే రిజర్వ్​ బ్యాంక్​ ను ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు. 1927లో సైమన్​ కమిషన్​ను ఏర్పాటు చేసిన బ్రిటీష్‌‌ ప్రభుత్వం ఈ బాధ్యతను దానికి అప్పగించింది. 1932 వరకు మూడు సార్లు రౌండ్‌‌ టేబుల్‌‌ సమావేశాలు నిర్వహించి రిజర్వ్​బ్యాంక్‌‌ అవసరమని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.  ఎట్టకేలకు1935 ఏప్రిల్‌‌ 1న రిజర్వ్​ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ ఇండియా(ఆర్బీఐ) చట్టం అమల్లోకి వచ్చింది. ఇప్పటికీ నిరంతరాయంగా తన విధులు నిర్వహిస్తూనే ఉంది. బ్యాంకింగ్‌‌ రెగ్యులేషన్‌‌ చట్టం ద్వారా 1949లో రిజర్వ్ బ్యాంక్​ను జాతీయం చేశారు. రిజర్వ్​ బ్యాంక్‌‌ ఏర్పాటు, బ్యాంకింగ్‌‌ రెగ్యులేషన్‌‌ చట్టం కోసం 1926 నుంచి 1949 వరకు అంబేద్కర్‌‌ ఎంతో కృషి చేశారు. రిజర్వ్​ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ ఇండియాకు రూపకల్పన చేసింది అంబేద్కర్‌‌ కాదా? అలాంటిది ఆయన ఫొటో లేకుండా కరెన్సీ నోటు ఉండడం బాధాకరం. ఆర్బీఐకి సంబంధం లేని మహనీయుల ఫొటోను ముద్రించడానికి మేము వ్యతిరేకం కాదు. కానీ రిజర్వ్​ బ్యాంక్‌‌ స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్‌‌ ఫొటోను ఎందుకు ముద్రించడం లేదని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా అంబేద్కర్‌‌ ఫొటోను కరెన్సీ నోటుపై ముద్రించాలని ఆయన 130వ జయంతి సందర్భంగా డిమాండ్‌‌ చేస్తున్నాం.


రాజ్యాంగం కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు


ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన అంబేద్కర్​ మన దేశం కోసం రాజ్యాంగాన్ని రూపొందించారు. 1949 నవంబర్‌‌ 26న రాజ్యాంగ రచనా సంఘం దానిని ఆమోదించగా.. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజును మనమంతా‘‘రిపబ్లిక్‌‌ డే’’గా జరుపుకుంటున్నాం. రాజ్యాంగంలో ప్రజందరికీ ఎన్నో హక్కులను అంబేద్కర్​ కల్పించారు. ఓటు హక్కు, కార్మిక హక్కు, విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి ఎన్నో చట్టాలు తీసుకొచ్చారు. కానీ, రిపబ్లిక్​డే ను జరుపుకుంటున్నా.. ఆ రోజు అంబేద్కర్‌‌ చిత్రపటం పెట్టకపోవడం సిగ్గుచేటు. రిపబ్లిక్‌‌డే జెండా పండుగలో అంబేద్కర్‌‌ చిత్రపటం పెట్టకపోవడం రాజ్యవిద్రోహమే. అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి.


అంబేద్కర్​ జయంతి వద్దని.. సీఎం సభ మాత్రం ఎట్ల పెట్టారు
1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుకు గుర్తుగా రిపబ్లిక్ డే జరుపుకొంటున్న మనం ఆ వేడుకల్లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌‌ ఫొటో పెట్టకపోవడం రాజ్యాంగాన్ని అవమానించినట్లే. ఇకనైనా దీనిపై కేంద్రం కచ్చితమైన ఆదేశాలివ్వాలి. కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్‌‌ భవనానికి అంబేద్కర్‌‌ పేరును పెట్టాలి. ఎంట్రన్స్​ వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి కూడా ఆయన పేరు పెట్టి,  ముఖద్వారం వద్ద కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. ఇక కరోనా సాకుతో కేసీఆర్ సర్కారు మహనీయుల జయంతులను రద్దు చేస్తూ జీవో ఇచ్చింది. అంబేద్కర్​ జయంతి నిర్వహించవద్దని చెప్పిన ఏప్రిల్​ 14నే.. నాగార్జున సాగర్​లో సీఎం కేసీఆర్​ ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తున్నారు. ప్రచార సభలకు లేని కరోనా నిబంధనలు మహనీయుల జయంతులకే అడ్డువచ్చాయా? మహనీయుల జయంతులు జరిపేలా ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి. లేకపోతే ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా అంబేద్కర్​ జయంతి నిర్వహించి తీరుతాం.


                                                                            - జేరిపోతుల పరశురామ్,జాతీయ అధ్యక్షుడు,కరెన్సీపై అంబేద్కర్​ ఫొటో సాధన సమితి