
భారత దేశంలోని అంటరాని కులాలు, వెనుక బడిన వర్గాల్లో రాజకీయ ఐక్యతను, రాజ్యాధికారాన్ని సాధించి చూపిన సామాజిక సంఘ సంస్కర్త, బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు మాన్యవర్ దాదా సాహెబ్ కాన్షీరామ్. మన దేశ అసమానతల సమాజంలోని నిమ్న, బహుజన కులాలను బానిసత్వం నుంచి బయట పడేసేందుకు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ తన జీవితాంతం పోరాడారు.
రాజ్యాధికారం( మాస్టర్ కీ)తోనే అంటరాని, బలహీన వర్గాలకు సామాజిక అభివృద్ధి సాధ్యమన్న బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాన్ని ఆయన వారసత్వ బాటలో నడిచిన కాన్షీరామ్ సాధించి చూపారు. పంజాబ్ లో దళిత కుటుంబంలో పుట్టిన కాన్షీరామ్ తన ఉన్నతోద్యోగాన్ని వీడి బహుజన రాజ్యాధికార సాధన బాటపట్టారు. బహుజనులకు రాజ్యాధికారాన్ని సాధించారు కాన్షీరామ్. తద్వారా ఆయన భవిష్యత్ తరాల బహుజన నేతలకు ఆదర్శంగానూ, స్ఫూర్తిగానూ నిలిచిపోయారు.
జాతీయస్థాయి పార్టీగా మలిచారు
1984 ఏప్రిల్14న అంబేద్కర్ జయంతి రోజునే బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)ని కాన్షీరామ్ స్థాపించారు. రాముడు, కృష్ణుడు పుట్టిన నేలగా దేశ ప్రజలు విశ్వసించే ఉత్తరప్రదేశ్ లో పార్టీని ప్రారంభించారు. గౌతమ బుద్ధుడు, ఫూలే, నారాయణ గురు, పెరియార్, సాహు మహరాజ్, అంబేద్కర్ వంటి సామాజిక, సంఘ సంస్కర్తల సిద్ధాంతాలు, ఆదర్శాలను పార్టీ సిద్ధాంతంగా తీసుకున్నారు.
మన రాజ్యాంగంపై ఉండే ఐరావతం (ఏనుగు)నే ఎన్నికల చిహ్నంగా ఎంచుకున్నారు. ఏనుగు ఎక్కి చట్టసభలకు వెళ్లాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను బరిలోకి దించారు. అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో పార్టీని నాలుగుసార్లు అధికారంలోకి తెచ్చారు. దేశ రాజకీయాల్లోనూ ఒకదశలో ఆయన కీలకపాత్ర పోషించారు. మూడో అతి పెద్ద జాతీయపార్టీగా మలిచారు. బీఎస్పీని ఉత్తర భారత్లోనే కాదు.. దక్షిణాది రాష్ట్రాల్లోనూ రాజకీయ శక్తిగా తీర్చిదిద్దారు.
బహుజనుల ఐక్యతతోనే రాజ్యాధికారం
స్వాతంత్ర్యం తరువాత అంబేద్కర్ వాదం బలోపేతానికి ఆచరణాత్మకంగా కృషి చేసిన సాధకుడు కాన్షీరామ్. దేశంలోని 85 శాతం మంది ప్రజలైన బహుజనులకు.. రాజకీయ ఐక్యత ద్వారానే రాజ్యాధికారం సాధ్యమని కాన్షీరామ్ బలంగా నమ్మారు. అదే సామాజిక ప్రగతికి మూలమని.. అందుకు బహుజనులు ఐక్యమైతే రాజ్యాధికారం సాధించవచ్చని పిలుపునిచ్చారు. ఒకే పార్టీ, ఒకే నాయకత్వం, ఒకే సిద్ధాంతంతో సంఘటితం కావాలని .. ‘ఒకే ఓటు – -ఒకే నోటు నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు. కులాన్ని నిర్మూలిద్దాం.
ALSO READ | విద్యా కమిషన్ సిఫార్సులు అసెంబ్లీలో చర్చించాలి
బహుజన సమాజాన్ని నిర్మిద్దాం అంటూ దేశవ్యాప్తంగా ఉద్యమించారు. ఇలా కాన్షీరామ్ బహుజన నినాద స్ఫూర్తితో పలు రాష్ట్రాల్లో మరికొన్ని బహుజన పార్టీలు పుట్టుకొచ్చాయి. అధికారంలోకి కూడా వచ్చాయి. అలా వచ్చినవే బిహార్లో 1997లో లాలూ ప్రసాద్ యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ), 1992లో ఉత్తరప్రదేశ్లో ములాయంసింగ్ యాదవ్ స్థాపించిన సమాజ్ వాదీ పార్టీ. ఇవి జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొందాయి.
ప్రత్యామ్నాయ శక్తిగా నిలిపారు..
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక పీడిత, బహుజనులను పాలకులను చేయాలనే ఆశయంతో 1956లో అంబేద్కర్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను ప్రారంభించారు. కానీ, కొంతకాలానికే ఆయన అకాల మరణంతో పార్టీని అనుచరులు ముందుకు తీసుకెళ్లలేకపోయారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కాన్షీరామ్ ముందుకొచ్చి కృషి చేశారు. అప్పటికే దేశంలో తిరుగులేని కాంగ్రెస్ ను, బీజేపీని ఎదుర్కొంటూ పార్టీని ప్రత్యామ్నాయ శక్తిగా నిలిపారు. బహుజనులకు రాజ్యాధికారాన్ని సాధించి సక్సెస్ అయ్యారు.
- వేల్పుల సురేష్, సీనియర్ జర్నలిస్ట్–