బాబా సిద్దిఖీ హత్య వెనక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్..!

బాబా సిద్దిఖీ హత్య వెనక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్..!

ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ దారుణ హత్య మహారాష్ట్రలో సంచలనంగా మారింది. శనివారం ( అక్టోబర్ 12, 2024 ) రాత్రి ముంబైలో ఆయనపై ముగ్గురు దుండగులు కాల్పులు జరిపారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఇప్పటికే ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేయగా.. వారిని హర్యానాకు చెందిన కర్నైల్ సింగ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధర్మరాజ్ కశ్యప్‌లుగా గుర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇద్దరు నిందితులు తాము లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ కు చెందినవారమని కస్టడీలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

కాల్పుల జరిపిన ప్రదేశంలో నిందితులు దాదాపు నెల రోజులపాటు రెక్కీ నిర్వహించినట్లు వెల్లడించారని సమాచారం అందుతోంది. అయితే.. ఈ విషయంపై ఇంత వరకూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాల్పుల జరిపిన ప్రదేశానికి నిందితులు ముందుగానే ఆటోలో చేరుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఉందా లేదా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

త్వరలోనే మహారాష్ట్రలొ అసెంబ్లీ ఎన్నికల జరగనున్న క్రమంలో ఈ ఘటన రాజకీయ వర్గాల్లో భద్రతాపరమైన ఆందోళనలను కలిగిస్తోంది. కాగా.. ఆ మధ్య నటుడు సల్మాన్‌ఖాన్‌ ఇంటి వద్ద లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా.. సల్మాన్‌ను టార్గెట్‌ చేసిన బిష్ణోయ్‌ గ్యాంగ్‌.. సల్మాన్ కు మంచి స్నేహితుడైన బాబా సిద్ధిఖీని హత్య చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సిద్ధిఖీకి ఎటువంటి బెదిరింపులు రాలేదని పోలీసులు స్పష్టం చేశారు.