T20 World Cup 2024: ప్రతి ఒక్కరి స్థానంలో నేను ఆడలేను.. ఓటమిని జట్టుపై నెట్టేసిన బాబర్ అజామ్

T20 World Cup 2024: ప్రతి ఒక్కరి స్థానంలో నేను ఆడలేను.. ఓటమిని జట్టుపై నెట్టేసిన బాబర్ అజామ్

టీ20 వరల్డ్ కప్ లో ఫేవరేట్ గా బరిలోకి దిగిన పాకిస్థాన్ కనీసం సూపర్ 8 కు అర్హత సాధించలేకపోయింది. బాబర్ అజామ్ కెప్టెన్సీలో పాకిస్థాన్ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వడంలో విఫలమైంది. అమెరికా, భారత్ చేతిలో ఓడిపోయి సూపర్ 8 అవకాశాలను కోల్పోయింది. దీనికి తోడు వర్షం రూపంలో దురదృష్టం వెక్కిరించింది. దీంతో పాకిస్థాన్ జట్టుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బాబర్ అజామ్ కెప్టెన్సీపై నెటిజన్స్ మండిపడుతున్నారు. తాజాగా తన కెప్టెన్సీపై వస్తున్న విమర్శలను బాబర్ కప్పి పుచ్చుకున్నాడు. 

వరల్డ్ కప్ లో భాగంగా ఐర్లాండ్ తో జరిగిన చివరి మ్యాచ్ లో పాకిస్థాన్ విజయం సాధించింది. ఆదివారం (జూన్ 16) జరిగిన ఈ మ్యాచ్ లో 3 వికెట్ల తేడాతో ఐరీష్ టీంపై నెగ్గింది. ఈ మ్యాచ్ తర్వాత విలేఖరి సమావేశంలో బాబర్ వరల్డ్ కప్ లో గ్రూప్ దశలోనే నిష్క్రమించడంపై మాట్లాడాడు. "మేము జట్టుగా బాగా ఆడలేదు. ఏ ఒక్కరినో మనం తప్పు పట్టడానికి వీల్లేదు. జట్టుగా ఆడడంలో విఫలమయ్యాం. ప్రతి ఒక్కరి స్థానంలో నేను ఆడలేను. ఈ టోర్నీలో బౌలింగ్ లో రాణించినా.. బ్యాటింగ్ లో విఫలమయ్యాం". అని బాబర్ తన కెప్టెన్సీని సమర్ధించుకున్నాడు. 

వన్డే ప్రపంచ కప్ 2023లో పేలవ ప్రదర్శన అనంతరం పాకిస్తాన్ క్రికెట్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ ఆ జట్టు సారథి బాబర్ ఆజామ్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. మసూద్‌ నాయకత్వంలో పాక్.. ఆస్ట్రేలియా చేతిలో టెస్ట్ సిరీస్ వైట్‌వాష్‌(3 టెస్టులు)  అవ్వగా.. ఆఫ్రిది కెప్టెన్సీలో న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-4 తేడాతో కోల్పోయింది. దీంతో వీరిని తప్పించి ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో మళ్లీ బాబర్ ఆజంకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. పాక్ జట్టులో ఎన్ని మార్పలు చేసినా ఫలితం మాత్రం మారలేదు.