ICC Test rankings: టాప్ 10 నుండి ఔట్.. భారీగా పడిపోయిన బాబర్ ర్యాంక్

బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో పేలవ ప్రదర్శనతో పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ టెస్ట్ ర్యాంకింగ్ దిగజారింది. అతను మూడో స్థానం నుంచి ఏకంగా 9 స్థానాలు దిగజారి 12 వ స్థానంలో నిలిచాడు. టెస్టుల్లో దారుణమైన బ్యాటింగ్ తో జట్టుకు భారంగా మారుతున్నాడు. సొంతగడ్డపై ఫామ్ లో వస్తాడనుకుంటే పసికూన బంగ్లాదేశ్ పై ఆడలేక చతికిల చతికిల పడ్డాడు.

బంగ్లాదేశ్ తో సొంతగడ్డపై జరిగిన రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో బాబర్ ప్లాప్ షో చేశాడు.తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో డకౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్ లో 22 పరుగులు మాత్రమే చేశాడు. రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 31 పరుగులు చేసిన బాబర్.. తాజాగా రెండో ఇన్నింగ్స్ లో 11 పరుగులకే పరిమితమయ్యాడు. ఈ సిరీస్ లో అద్భుతంగా ఆడిన పాక్ వికెట్ కీపర్ బ్యాటర్ మహమ్మద్ రిజవాన్ టాప్ 10లో చోటు సంపాదించాడు.

ALSO READ | WTC Final: ఒక్క మ్యాచ్ కాదు.. సిరీస్‌లా జరపాలి.. రోహిత్ నిర్ణయాన్ని సమర్ధించిన ఆసీస్ స్పిన్నర్

ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ 922 రేటింగ్ పాయింట్లతో టెస్టుల్లో నెంబర్ వన్ స్థానంలోనే కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ రెండో స్థానంలో నిలిచాడు. టీమిండియా తరపున ముగ్గురు ఆటగాళ్లు టాప్ 10 లో చోటు దక్కించుకున్నారు. రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ వరుసగా 6,7,8 స్థానాల్లో నిలిచారు.

బౌలింగ్ విషయానికి వస్తే టీమిండియా వెటరన్ స్పిన్నర్ అశ్విన్ (870) తన అగ్ర స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బుమ్రా (847) మూడో స్థానంలో.. జడేజా(788) ఏడో స్థానంలో ఉన్నారు. టీమ్స్ లో ఆస్ట్రేలియా (124) అగ్ర స్థానంలో.. ఇండియా(120) రెండో స్థానంలో ఉన్నాయి.